Categories: TOP STORIES

తెలంగాణ నిర్మాణ రంగం బంద్ కు ఆప్ మద్ధతు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిమెంటు, స్టీలు సంస్థ‌ల నియంతృత్వ పోక‌డ‌ల్ని నిరోధించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మయ్యాయని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. సోమవారం తెలంగాణలోని నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా చేపట్టిన ఒక రోజు బంద్ కు సంపూర్ణ మద్ధతు తెలిపింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ చెబుతూనే మరోవైపు సిమెంటు, స్టీలు, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతుంటే కళ్లప్పగించి చూస్తోందని విమర్శించింది. నిర్మాణ సామగ్రి దిగుమతులపై ఏడున్నర శాతం సుంకాన్ని తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీ ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ రూపంలో వివిధ రేట్లను వసూలు చేస్తున్నారని.. వాటిని ఇప్పటికైనా హేతుబద్ధీకరించాలని.. తగ్గింపును వర్తింపజేయాలని కోరారు.

* నిర్మాణ సంఘాలు నెత్తినోరు మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని ఆమె విమర్శించారు. మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల రూపంలో ఐదు వంద‌ల‌ కోట్లు వచ్చాయని ప్రభుత్వం భావిస్తోందని.. మహారాష్ట్ర తరహాలో స్టాంప్ డ్యూటీ తగ్గిస్తే.. రెండు, మూడు రెట్లు ఆదాయం పెరిగేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం పూర్తిగా మానివేయాలని హితువు పలికారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఐటీ పార్కులు, ప్లాస్టిక్ పార్కులు, లాజిస్టిక్ పార్కులంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్ర‌క‌టిస్తూ.. ఆయా ప్రాంతాల్లో కృత్రిమంగా రేట్ల‌ను పెంచుతోంద‌ని విమ‌ర్శించారు. దీని వ‌ల్ల‌ గ‌త మూడేండ్ల‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం హైద‌రాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్ప‌డింద‌ని విచారం వ్య‌క్తం చేశారు. తెలంగాణ నిర్మాణ రంగానికి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మ‌ద్ధ‌తుగా ఉంటుంద‌ని.. ఈ రంగం ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌కు ఢిల్లీ స్థాయిలో ప‌రిష్కారం ల‌భించే విధంగా చొర‌వ తీసుకుంటామ‌ని తెలిపారు.

This website uses cookies.