హైదరాబాద్‌లోని రియల్ సంస్థలపై రెరా అథారిటీ సీరియస్ అవుతోంది. పలు కంపెనీలకు నోటీసులను జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి పూర్వాపరాల్ని తెలుసుకుంటోంది. రెరా నిబంధనల్ని అతిక్రమించే కంపెనీలపై జరిమానాను విధించే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఆర్‌జే గ్రూపుపై సంస్థ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కంపెనీకి తెలంగాణ రెరా అథారిటీ నోటీసును జారీ చేసింది. నిర్ణీత గడువు ముగిసినప్పటికీ, ఆర్‌జే కంపెనీ రెరాకు సమాధానం ఇవ్వకపోవడంతో.. ఈ కంపెనీపై జరిమానాను విధించేందుకు సమాయత్తం అవుతున్నది.
తెలంగాణ రెరా అథారిటీ నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో 2017 జనవరి ఒకటో తేది నుంచి.. 500 గజాలు లేదా అంతకుమించిన విస్తీర్ణంలో అభివృద్ధి చేసే వెంచర్ అయినా ఎనిమిది కంటే ఎక్కువ ఫ్లాట్లను నిర్మించాలనుకున్నా.. రెరా నిబంధనలు సెక్షన్ 1 (2) ప్రకారం తెలంగాణ రెరా అథారిటీలో నమోదు చేసుకోవాలి. ఒక ప్రమోటర్.. ప్లాటు లేదా ఫ్లాటుకు సంబంధించిన ప్రకటనల్ని విడుదల చేయాలని అనుకున్నా అమ్మకాల్ని చేపట్టాలనుకున్నా.. తప్పనిసరిగా రెరా చట్టం సెక్షన్ 3 (1) ప్రకారం.. అథారిటీ వద్ద అనుమతి తీసుకోవాలి. ఆయా ప్రాజెక్టులో కొనేందుకు కొనుగోలుదారుల్ని ఆహ్వానించాలన్నా ఇది తప్పనిసరి. కానీ, ఈ నిబంధనల్ని పాటించకుండా.. రెరా అనుమతి లేకుండా ఈ సంస్థ యూనిట్లను విక్రయిస్తోందని తెలుసుకుంది. దీంతో ఈ సంస్థకు నోటీసును జారీ చేసింది. రెరా చట్టం సెక్షన్ 59 ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు విలువలో పది శాతం సొమ్మును జరిమానాగా ఎందుకు విధించకూడదో తెలియజేయాలని నోటీసునిచ్చింది. కానీ, ఇప్పటివరకూ సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి జవాబు రాకపోవడంతో జరిమానాను విధిస్తోంది.
నిబంధనల్ని తుంగలో తొక్కి..
తెలంగాణ రెరా అథారిటీ నిబంధనల్ని పాటించకుండా.. ఆర్ జే గ్రూపు అనే సంస్థ ఘట్ కేసర్లోని యమ్నంపేట్లో బ్లిస్ హైట్స్ అనే రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయిస్తోంది. పటాన్ చెరులోని కర్దనూరు రోడ్డులో జై వాసవి ఓఆర్ఆర్ హైట్స్ అనే నిర్మాణాన్ని రెరా అనుమతి లేకుండా అడ్వర్టయిజ్మెంట్ చేయడంతో పాటు యూనిట్లను అమ్ముతున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న రెరా అథారిటీ సెప్టెంబరులో నోటీసుల్ని జారీ చేసిన విషయం తెలిసిందే.