కొనుగోలుదారుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే మహారాష్ట్ర రెరా తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, భూ యజమానులు, కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ఐదు ఆదేశాలు జారీ చేసింది. అవేంటంటే..
అమ్మకపు ఒప్పందంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని పేర్కొనడం తప్పనిసరి చేస్తూ రెరా నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా డెవలపర్, కొనుగోలుదారు మధ్య అమలయ్యే అమ్మకపు ఒప్పందంలో కమీషన్, బ్రోకరేజ్ వంటివి స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. ఈ ఉత్తర్వుల వల్ల ఏజెంట్లు తమ ఫీజులు, కమీషన్లు సకాలంలో తీసుకోవడానికి, బ్రోకరేజ్ లు చెల్లించని కారణంగా తలెత్తే వివాదాలను తగ్గించడానికి వీలు కల్పిస్తుందని ఏజెంట్లు చెబుతున్నారు.
ఎన్ని అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా 500 చదరపు మీటర్ల లోపు ప్లాట్లకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదని రెరా పేర్కొంది. 500 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులను రెరా రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించడం వల్ల కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.
యూనిఫైడ్ డెవలప్ మెంట్ కంట్రోల్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్స్ కింద నిర్మితమవుతున్న డెవలప్ మెంట్ ప్రాజెక్టుల కోసం కమెన్స్ మెంట్ సర్టిఫికెట్ (సీసీ), కంప్లీషన్ సర్టిఫికెట్ (సీసీ) అంటే ఏమిటో మహా రెరా నిర్వచించింది. ప్లాటెడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర యూనిఫైడ్ డెవలప్‌మెంట్ కంట్రోల్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్స్ ఫారమ్ డీ-3లో భూమి ఉపవిభాగ లేఅవుట్‌కు తుది ఆమోదం లేదా వ్యవసాయేతర అనుమతితో సమానమైన ఆమోదం ప్లాట్‌కు ప్రారంభ ధృవీకరణ పత్రంగా పరిగణించబడుతుందని రెరా పేర్కొంది. కంప్లీషన్ సర్టిఫికేట్ విషయానికి వస్తే.. ప్రారంభ, పూర్తయ్యే తేదీని పేర్కొంటూ ఫారం-4తో కలిపి ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని కంప్లీషన్ సర్టిఫికెట్ గా పరిగణిస్తారని తెలిపింది.
రియల్ డెవలపర్లు కొనుగోలుదారుదారుల నుంచి తీసుకున్న మొత్తాలను వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయకూడదని రెరా గతంలో స్పష్టంచేసింది. ఆర్థిక క్రమశిక్షణ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి వారు ఒకే బ్యాంకులో ప్రతి ప్రాజెక్టుకూ మూడు ఖాతాలు నిర్వహించాలని పేర్కొంది. అయితే, భూ యజమానులను కూడా మహా రెరా ప్రమోటర్లుగా పరిగణిస్తున్నందున వారు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలు నిర్వహించాల్సిన అవసరం ఉందా అనే సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భూ యజమానులు ప్రమోటర్లు (డెవలపర్) కాకపోతే వారు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలను తెరవడం తప్పనిసరి కాదని సెప్టెంబర్ 4న మహారేరా తెలిపింది.
సేల్ అగ్రిమెంట్‌లో గృహ కొనుగోలుదారులకు కేటాయించిన లేదా విక్రయించిన పార్కింగ్ స్థల వివరాలను తప్పనిసరిగా చేర్చాలని, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలూ లేకుండా ఉండేందుకు కేటాయింపు లేఖను జారీ చేయాలని గతంలో మహా రెరా డెవలపర్లను కోరింది. తాజాగా దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
This website uses cookies.