హైదరాబాద్ లో 7 శాతం పెరుగుదల
ఢిల్లీలో ఏకంగా 57 శాతం వృద్ధి
ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ లో ఇళ్ల ధరలు కాస్త పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో సగటున 7 శాతం మేర పెరుగుదల నమోదైంది. ఈ మేరకు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే.. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో 7 నిం 57 శాతం మధ్య పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్ లో అతి తక్కువగా 7 శాతం మేర పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో చదరపు అడుగు ధర సగటున రూ.7,050కి పెరిగింది. గతేడాది ఇతే త్రైమాసికంలో రూ.6,580గా ఉంది. ఢిల్లీలో అత్యధికంగా 57 శాతం మేర ధరలు పెరిగాయి. అక్కడ చదరపు అడుగు ధర రూ.8,017కు చేరింది. డిమాండ్ పెరగడమే ధరల వృద్ధికి కారణమని నివేదిక వివరించింది.
నగరాలవారీగా చూస్తే.. బెంగళూరులో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగి చదరపు అడుగు రూ.7,512కు చేరింది. చెన్నైలో 22 శాతం మేర పెరిగి, చదరపు అడుగు రూ.7,179కు చేరుకుంది. కోల్‌కతాలో ఇళ్ల ధరలు చదరపు అడుగు రూ.5,844కి పెరిగింది. గతేడాది ఇదే కాలంలోని ధరతో పోల్చి చూస్తే 22 శాతం అధికం. ముంబైలో ధరలు 21 శాతం పెరిగి, చదరపు అడుగు ధర రూ.12,590గా నమోదైంది. పుణెలో 18 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,953కు చేరింది. అహ్మదాబాద్ పట్టణంలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.4,736గా నమోదైంది. ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో బలాన్ని, వృద్ధి అవకాశాలను తెలియజేస్తున్నాయని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
This website uses cookies.