ఏదైనా ప్రాజెక్టుకు క్రెడిటర్ గా ఉన్న బ్యాంకులు కూడా రెరాకు జవాబుదారీగా ఉండాల్సిందేనని, వాటికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే రెరా దృష్టికి తీసుకెళ్లవచ్చని రాజస్థాన్ హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ విషయంలో రెరా చట్టానికి, బ్యాంకు రికవరీ చట్టానికి మధ్య వివాదం తలెత్తినా.. ఇక్కడ రెరా చట్టం మాత్రమే వర్తిస్తుందని తేల్చి చెప్పింది. బ్యాంకు వేలాన్ని రద్దు చేస్తూ రాజస్తాన్ రెరా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సన్ రైజర్స్ అనే ప్రాజెక్టును డెవలపర్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (గతంలో ఆంధ్రా బ్యాంకు)కు తనఖా పెట్టి రూ.15 కోట్లు రుణం తీసుకున్నారు. అప్పటికే చాలామంది అందులో ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. అయితే, డెవలపర్లు ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో యూనియన్ బ్యాంకు ఆ ప్రాజెక్టును జప్తు చేసింది. అనంతరం ఫ్లాట్లను వేలం వేసింది. దీంతో ఫ్లాట్లు బుక్ చేసుకున్నవారి ఫిర్యాదు మేరకు రెరా ఆ వేలాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని తమకు అప్పగించాలని బ్యాంకును ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బ్యాంకు హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు రికవరీ చట్టాలను రెరా నిరోధించలేదని బ్యాంకు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బ్యాంకులు ప్రమోటర్ల కిందకు రానందున రెరా పరిధిలోకి తాము రాబోమని పేర్కొన్నారు. అయితే, వీటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రమోటర్ల బూట్లలో బ్యాంకు కాళ్లు పెట్టిందని.. ప్రమోటర్ల తరఫు ఏజెన్సీగా వ్యవహరించిందని, అందువల్ల రెరా పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. దీంతో బ్యాంకు రికవరీ చట్టాల కంటే రెరాయే ఇక్కడ వర్తిస్తుందని పేర్కొంది.
This website uses cookies.