Categories: Rera

‘మంత్రి’ఫై ఫోరెన్సిక్ ఆడిట్ కు రెరా ఆదేశం

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మంత్రి డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ అయిన మంత్రి టెక్నాలజీ కాన్ స్టెలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కర్ణాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (రెరా) నిర్ణయించింది. ఈ మేరకు ఆడిట్ నిర్వహించడం కోసం ఓ ప్రైవేట్ కంపెనీని నియమించింది.

కేఆర్ పురంలోని రాచేనహళ్లిలో మంత్రి మాన్యతా ఎనర్జీకి మొత్తం రూ.475.92 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో కంపెనీ కొనుగోలుదారుల నుంచి రూ.75.17 కోట్లు వసూలు చేసిందని.. కానీ ప్రాజెక్టు కీలక వివరాలను వెల్లడించలేదని రెరా గుర్తించింది. అదే సమయంలో అపార్ట్ మెంట్లలో 60 శాతం అమ్మకాలు జరిగాయని.. కానీ పనులు 3 శాతం మాత్రమే పూర్తయ్యాయని కంపెనీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కోసం వసూలు చేసిన నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిపై దర్యాప్తు చేయాలని కొందరు రెరాను ఆశ్రయించారు. ఆడిటింగ్ ఖర్చును ఫిర్యాదుదారులు భరించాలనే షరతుతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ కోసం జేఏఏ అండ్ అసోసియేట్స్ ను నియమిస్తూ కర్ణాటక రెరా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆడిట్ ఖర్చును ఫిర్యాదుదారులే ఎందుకు భరించాలనే అంశంపై రెరా వివరణ ఇవ్వలేదు. నిజానికి రెరా చట్టంలోని సెక్షన్ 75(2)(బి) ప్రకారం.. రెరా తన విధులను నిర్వర్తించడానికి తన అంతర్గత నిధులే వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఆడిట్ ఖర్చును ఫిర్యాదుదారులే భరించాలని స్పష్టం చేసింది.

This website uses cookies.