Categories: TOP STORIES

పెట్టుబడుల్లో పదేళ్ల దాకా.. హైదరాబాద్ తగ్గేదెలే!

వచ్చే పదేళ్ల దాకా హైదరాబాద్లో పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని క్రెడాయ్ నిర్వహించిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. క్రెడాయ్ హైదరాబాద్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సేవల సంస్థ అప్ వైజరీ తో కలిసి ప్రప్రథమంగా నగరంలో పెట్టుబడుల సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా పేరెన్నిక గల ఆర్థిక సంస్థల నుంచి ఫండ్ మేనేజర్లు పాల్గొన్నారు. దీనికి మోడరేటర్ గా అనూజ్ కపూర్ వ్యవహరించారు.

మోతీలాల్ ఓస్వాల్ సీఈవో శరద్ మిట్టల్ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల్లో తమ ఫండ్ హైదరాబాద్లో పదిహేను రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల్ని పెట్టిందన్నారు. ఈ నగరం తమ నూతన పెట్టుబడులకు సంబంధించి గణనీయమైన వాటాలను ఆకర్షిస్తోందని తెలిపారు. దీనికి వైవిధ్యమైన ఆర్థిక అంశాలు తోడ్పడటంతో పాటుగా ప్రపంచ శ్రేణీ పెట్టుబడులు, కాస్మోపాలిటన్ సంస్కృతి కూడా ఒక కారణమని అన్నారు. సుందరం ఆల్టర్నేటివ్స్ డైరెక్టర్ కార్తీక్ ఆత్రేయ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా తమ పెట్టుబడులు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయని.. హైదరాబాద్ డెవలపర్లు కమిట్ మెంట్ తో ఉండటం వల్ల సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని తెలిపారు.

టీష్మన్ స్పయర్స్ హెడ్ ఆఫ్ క్రెడిట్ వైభవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉండొచ్చని.. ఫలితంగా ప్రాజెక్టు వ్యయంపై ప్రభావం పడుతుందని.. కాకపోతే, నగరంలో రెసిడెన్షియల్ డిమాండ్ స్థిరంగా ఉన్నందు వల్ల మార్కెట్ వృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. టిష్మన్ స్పయర్స్ ఇండియా హెడ్ పర్వేష్ శర్మ మాట్లాడుతూ.. ఎంఎన్ సీలు హైదరాబాద్ పట్ల అమితాసక్తిని కనబరుస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ లో వీరిదే సింహభాగమని.. అందుకే తమ వంటి అంతర్జాతీయ డెవలపర్లు మరిన్ని అభివృద్ధి అవకాశాల కోసం అన్వేషిస్తుంటామని తెలిపారు. అప్ వైజరీ ఫౌండర్ అనూజ్ కపూర్ మాట్లాడుతూ.. కొంతకాలం నుంచి తాము హైదరాబాద్లో యాభైకి పైగా నిర్మాణాత్మక ఫండింగ్ లావాదేవీలను పూర్తి చేశామన్నారు. గ్లోబల్ నగరంగా మారే అన్ని అనుకూలతలు ఈ నగరానికి ఉన్నాయని.. సంస్థాగత మదుపరులు భాగ్యనగరం పట్ల అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారని తెలిపారు.

క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి. రామకృష్ణారావు మాట్లాడుతూ.. హైదరాబాద్ లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన మొట్టమొదటి రియల్ ఎస్టేట్ లక్ష్యిత మదుపరుల సదస్సు అని.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందిస్తున్నానని తెలిపారు. క్రెడాయ్ హైదరాబాద్ జీఎస్ వి. రాజశేఖర్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించారు. చక్కటి పరిపాలన, చురుకైన మౌలిక వసతుల అభివృద్ధితో రానున్న పదేళ్లలో రియల్ రంగంలో పెట్టుబడులపై ఆశాభావం వ్యక్తం కావడాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ మీనన్, 150 మందికి పైగా డెవలపర్లు, 20కి పైగా దేశీయ, అంతర్జాతీయ ఫండ్ మేజర్లు పాల్గొన్నారు.

This website uses cookies.