- హైదరాబాద్లో ప్రాజెక్టు ఆలస్యం
- గతంలో 18 నెలలు
- ప్రస్తుతం 10 నెలలకు చేరింది
రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ యాక్ట్ (రెరా) వచ్చిన తర్వాత భారత రియల్ ఎస్టేట్ రంగంలో పరిస్థితులు మెరుగుపడినా కొన్ని సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. రియల్ ప్రాజెక్టుల్లో నెలకొనే జాప్యమే ఈ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లలో ఒకటి. ఇలాంటి జాప్యాల వల్ల వినియోగదారులు విశ్వాసం సన్నగిల్లడంతోపాటు ఇటు వినియోగదారులు, అటు పెట్టుబడిదారులకు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. సకాలంలో అనుమతులు లేకపోవడం, అవసరమైన నిధులను సమీకరించలేకపోవడం, కస్టమర్ల అడ్వాన్సులు సరిపోకపోవడం లేదా కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కావడం, నిధుల మళ్లింపు తదితర అంశాలు ఇందుకు కారణం కావొచ్చు. అంతిమంగా ఇవన్నీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే, దేశంలో 2016లో రెరా చట్టం ప్రవేశపెట్టిన తర్వాత రియల్ రంగం కాస్త మెరుగైంది.
ప్రొప్ఈక్విటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెరా వచ్చిన తర్వాత అగ్ర నగరాల్లో ప్రారంభమైన రెసిడెన్షియల్ ప్రాజెక్టులు సగటున 10 నుంచి 18 నెలలు మాత్రమే ఆలస్యమవుతున్నాయి. రెరా రాకముందు ఇది 20 నుంచి 48 నెలలుగా ఉండేది. రెరా చట్టం ప్రకారం.. ప్రాజెక్టులో విక్రయ కార్యకలాపాలు చేయాలంటే అనుమతి తప్పనిసరి. అంతేకాకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తిచేయకుంటే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొనుగోలుదారుల చెల్లింపుల ద్వారా వచ్చిన సొమ్మును సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనేది కూడా తనఖీలు చేసే వీలుంది. వీటి కారణంగా డెవలపర్లలో జవాబుదారీ పెరిగి రియల్ రంగంలో కొనుగోలుదారులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ కారణంగా జాప్యం అంశంలో చక్కని పురోగతి కనిపించింది.
రెరా రాకముందు హైదరాబాద్లో ప్రాజెక్టు ఆలస్యం సగటున 18 నెలలు ఉండగా.. రెరా వచ్చిన తర్వాత అది 10 నెలలకు తగ్గింది. అలాగే ఢిల్లీలో 47 నెలల నుంచి 17 నెలలకు, ముంబైలో 27 నెలల నుంచి 13 నెలలకు, బెంగళూరులో 23 నెలల నుంచి 12 నెలలకు, చెన్నైలో 21 నెలల నుంచి 12 నెలలకు, పుణెలో 20 నెలల నుంచి 12 నెలలకు, కోల్ కతాలో 23 నెలల నుంచి 14 నెలలకు తగ్గింది. మరోవైపు రెరా చట్టం అమలు తర్వాత అభివృద్ధి కనిపించినప్పటికీ, ఈ రంగంలో కొన్ని సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డెవలపర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా గణనీయమైన సంఖ్యలో పలు కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అలా నిలిచిపోయినవాటిలో సరసమైన, మధ్యస్థ ఆదాయ గృహ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎస్ డబ్ల్యూఏఎంఐహెచ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో ఏడాదికి కనీసం 10వేల గృహాలు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించకుంది. అయితే, నిలిచిపోయిన యూనిట్ల సంఖ్య ఏకంగా 4.50 లక్షలు ఉండటం వల్ల అవన్నీ ఇప్పటికిప్పుడు పూర్తయ్యే పరిస్థితి లేదు.