Categories: TOP STORIES

అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ మీద ఆంక్ష‌లు విధిస్తే.. పెనంలో నుంచి పొయ్యి మీద ప‌డ్డ‌ట్టే..!

జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థలు హైద‌రాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయంటే.. అప‌రిమిత ఎఫ్ఎస్ఐ (అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ) ఓ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. 2006లో విడుద‌లైన 86 జీవో ప్ర‌కారం.. ఒక స్థ‌లంలో ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని క‌ట్టే వీలును అప‌రిమిత ఎఫ్ఎస్ఐ క‌ల్పిస్తుంది. కాక‌పోతే, ఆ స్థ‌లం ముందున్న రోడ్డు వెడ‌ల్పును బ‌ట్టి.. ఆయా నిర్మాణానికి ఎంత ఎత్తు క‌ట్ట‌డానికి అనుమ‌తిస్తార‌నే అంశం ఆధార‌ప‌డుతుంది. అందుకే, అధిక శాతం ఆకాశ‌హ‌ర్మ్యాలు ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌ర్వీస్ రోడ్డు మీద లేదా 100-200 అడుగుల వెడ‌ల్పు గ‌ల రోడ్ల మీదే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మ‌రి, ఈ అప‌రిమిత ఎఫ్ఎస్ఐపై ఆంక్ష‌ల్ని విధించాల‌ని రేవంత్ స‌ర్కార్ భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఇది నిజ‌మే అయితే.. ఇప్ప‌టికే పెనం మీద ఉన్న రియాల్టీ మార్కెట్ పొయ్యిలో ప‌డ‌టం గ్యారెంటీ. ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికిది స‌రైన స‌మ‌యం కానే కాదు. కాక‌పోతే, దీనిపై భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అధిక నిర్మాణ స్థ‌లం రావ‌డం వ‌ల్లే.. భూముల ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని.. దీంతో సామాన్యులు సొంతిల్లు కొనుక్కోవ‌డం ఆసాధ్య‌మ‌వుతుంద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. గ‌తంలో ఎక‌రం స్థ‌లంలో ల‌క్ష నుంచి ల‌క్ష‌న్న‌ర మాత్ర‌మే క‌ట్టేవార‌ని.. కానీ, ప్ర‌స్తుతం ఎక‌రానికి నాలుగు నుంచి 6 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో క‌ట్ట‌డం వ‌ల్ల.. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లొస్తున్నాయ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

This website uses cookies.