ఇటీవల ప్రభుత్వం నిర్మాణ సంఘాలతో సంప్రదింపులు జరపడంతో ఎఫ్ఎస్ఐ పై మళ్లీ చర్చ మొదలైంది. ఎఫ్ఎస్ఐపై క్యాప్ విధించాలని కొందరు బిల్డర్లు.. అపరిమిత ఎఫ్ఎస్ఐ హైదరాబాద్‌కు ప్రధాన ఆకర్షణ అని మరికొందరు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఎస్ఐ విషయంలో ఇలా హైదరాబాద్ నిర్మాణ రంగం రెండుగా చీలిపోవడంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇంతకీ భాగ్యనగరంలో ఎఫ్ఎస్ఐ కాన్సెప్టు ఎప్పుడు ఆరంభమైంది? గత అనుభవాల్ని పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ నిర్మాణ రంగం జోరుగా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?
హైదరాబాద్‌కు ప్రత్యేకమైన గుర్తింపు రావడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కుతుంది. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో ఆలోచించి.. అపరిమిత ఎఫ్ఎస్ఐకి అనుమతినిచ్చారు. రోడ్డు విస్తీర్ణం, ప్లాటు సైజును బట్టి ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని కట్టుకునే వెసులుబాటు కల్పించారన్నమాట. ఇందుకోసం 2006లో జీవో నెం.86 విడుదల చేశారు. ఈ జీవో వచ్చాకే హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలు ఆరంభమయ్యాయి. బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని నిర్మించడానికి చాలామంది బిల్డర్లు ముందుకొచ్చారు. జాతీయ సంస్థలైనా హైదరాబాద్‌కి విచ్చేశాయంటే.. ఈ జీవో కారణంగానే. అంతేతప్ప, ఆయా కంపెనీలకు భాగ్యనగరమంటే ప్రత్యేక ప్రేమ లేదు.
జీవో నెం 86 రానంత వరకూ.. హైదరాబాద్‌లో అధిక శాతం మంది బిల్డర్లు నిర్మాణ నిబంధనల్ని అతిక్రమిస్తూ.. కోర్టుల చుట్టూ తిరిగేవారు. 2006 తర్వాత వీరంతా ప్రశాంతంగా నిర్మాణ పనుల్ని చేపట్టడంపై దృష్టి సారించారు. అనుమతి లభించినంత మేరకే నిర్మాణాల్ని చేపట్టడం అలవర్చుకున్నారు. సాధారణ స్థాయి కంటే నిర్మాణ స్థలం కొంత ఎక్కువ రావడంతో.. సహజంగానే అక్కడి మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నిర్మాణాలు చేపట్టే సంస్థల నుంచి ప్రత్యేకంగా ప్రభావిత రుసుము (ఇంపాక్టు ఫీజు)ను స్థానిక సంస్థలు వసూలు చేసేవి. పశ్చిమ హైదరాబాద్‌లోని ప్రతి బహుళ అంతస్తుల భవనం నుంచి స్థానిక సంస్థలకు రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్ల దాకా ప్రభావిత రుసుము వచ్చేది. 2006 నుంచి దాదాపు 2013 దాకా ప్రతి బిల్డరూ ఈ ఇంపాక్టు ఫీజును చెల్లించారు.
అప్పటివరకూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాల్ని చేపట్టిన బిల్డర్లు, డెవలపర్లు దారిలోకి వచ్చారు. స్వీయ నిబంధనల్ని పాటించడం అలవర్చుకున్నారు. ఫలితంగా, అక్రమ నిర్మాణాలు తగ్గుముఖం పట్టాయి. అపార్టుమెంట్లను కట్టే ప్రతి బిల్డరూ పది శాతం స్థలాన్ని స్థానిక సంస్థకు తనఖా పెట్టడం అలవాటు చేసుకున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవడమూ మొదలెట్టారు. 86 జీవో పారదర్శకత ఉండటంతో దేశవిదేశాలకు చెందిన సంస్థలు పోటీపడి హైదరాబాద్‌లో భూముల్ని కొనుగోలు చేశాయి. ఈ జీవో గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
అపరిమిత ఎఫ్ఎస్ఐ మీద ఆంక్షల్ని విధించాలనే వాదన దాదాపు పదేళ్ల నుంచి వినిపిస్తోంది. లేకపోతే నగరమంతా కాంక్రీటు జంగిల్లా మారిపోతుందని, మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయనేది కొందరి వాదన. కాకపోతే, నిర్మాణ నిబంధనల్ని అనుసరించి.. హరిత సూత్రాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఎలాంటి సమస్య ఉండదని గతంలో అనేక భవనాలు నిరూపించాయి. కాకపోతే, పదిహేనేళ్ల నుంచి హైదరాబాద్ ప్రత్యేకతను చాటి చెప్పిన అపరిమిత ఎఫ్ఎస్ఐ మీద ఆంక్షలు విధించాలా? లేదా? అనే అంశం మీద అధిక శాతం నిర్మాణ సంస్థల అభిప్రాయాల్ని తీసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక.. ఆకాశహర్మ్యాల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రభావిత రుసుమును తగ్గించింది. దీని వల్ల ఆరంభంలో నిర్మాణ రంగానికి కొందరికీ మేలు కలిగినా.. దీర్ఘకాలికంగా ఆయా నిర్మాణాల్ని చేపట్టే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మీద దెబ్బ పడింది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు గచ్చిబౌలి నుంచి నార్సింగి దాకా గల ఎక్స్‌ప్రెస్ వే సర్వీసు రోడ్డును వెడల్పు చేస్తోంది. ఫ్లయ్ఓవర్లను ప్లాన్ చేసింది. ఇంకా ప్రభుత్వం ఏం చేయాలంటే..
ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పా.. ఒప్పా.. అని తెలియడానికి కొంతకాలం పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా.. నిర్మాణ సంఘాల కోరిక మేరకు.. ఆకాశహర్మ్యాల మీద ఇంపాక్టు ఫీజును తగ్గించారు. ఒక ప్రాంతంలో వచ్చే ఆకాశహర్మ్యాల వల్ల ఆయా ఏరియాలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసేందుకు ఈ రుసుమును తీసుకుంటారు. పెంచాల్సిన రుసుమును ప్రభుత్వం తగ్గించేసింది. ఫలితంగా, ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. ఆకాశహర్మ్యాలైతే వచ్చాయి కానీ, అక్కడ మౌలిక అభివృద్ధి జరగలేదు. ఫలితంగా, ట్రాఫిక్ జామ్ సర్వసాధారణంగా మారింది. అదృష్టవశాత్తూ కరోనా వల్ల వాహనాల రద్దీ తగ్గింది కానీ లేకపోతే, గచ్చిబౌలి నుంచి నార్సింగి దాకా భారీ ట్రాఫిక్ జామ్ ఉండేది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ప్రభుత్వం కోకాపేట్ వెళ్లే రహదారిని వెడల్పు చేయడంతో పాటు సరికొత్త రహదారుల్ని అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం మళ్లీ ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్మును వెచ్చిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాల్ని నిర్మించే సంస్థల నుంచి ప్రభావిత రుసుమును వసూలు చేసి ఉంటే.. ప్రభుత్వ ఖజానాకు గండి పడేది కాదు కదా..
హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే సిటీగా మారేందుకు దోహదం చేసిన ఎఫ్ఎస్ఐ విధానాన్ని యధావిధిగా కొనసాగించాలి. జీవో నెం. 50ని మాత్రం రద్దు చేసి 168 జీవోను అమలు చేయాలి. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సెట్ బ్యాక్స్ పెరుగుతాయి. ఖాళీ స్థలాలొస్తాయి. లేఅవుట్ నిబంధనలు అంతటా ఒకేలా అమలు చేయాలి. చెరువులు, పార్కులు, ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలి. ఇందులో ఎట్టి పరిస్థితిలో రాజీ పడకూడదు. వరద నీటి కాల్వల్ని గుర్తించాలి.
20 మీటర్ల ఎత్తు తర్వాత ఎంత ఎత్తుకైనా వెళ్లేందుకు అనుమతినిచ్చే జీవో నెం.50ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. కోకాపేట్‌లో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు లైన్లు, మంచినీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలి. లేకపోతే, వేలం పాటలో స్థలాలు కొన్న కంపెనీలకూ ఇబ్బందికరంగా మారుతుంది. కొవిడ్ నేపథ్యంలో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ రంగం దారుణంగా మారింది. హైదరాబాద్ పరిస్థితి ఇందుకు మినహాయింపేం కాదు. అందుకే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అదనపు రుసుముల్ని విధించకూడదు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది.
This website uses cookies.