మళ్లీ కొందరు యూడీఎస్ అక్రమార్కులు హైదరాబాద్‌లో ప్రవేశించారు. నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా.. మోసపూరితంగా.. అమాయకుల్ని బుట్టలో వేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థలం కొనలేదు.. పర్మిషన్ తీసుకోలేదు.. రెరా నెంబరు కూడా లేదు.. అయినా, ఆకర్షణీయమైన బ్రోచర్లను ముద్రించి.. బహుళ అంతస్తులు నిర్మిస్తాం.. లగ్జరీ విల్లాలు కడతాం.. అంటూ మాయ చేస్తున్నారు. ఇప్పుడు కొంటే రేటు తక్కువ అంటూ మోసం చేస్తున్నారు. మరి, వీరిని అరికట్టేవారే లేరా? ఇలాంటి అక్రమార్కుల ఆగడాల్ని అరికట్టే వారే తెలంగాణ రాష్ట్రంలోనే లేరా? పురపాలక శాఖ అధికారులు ఎందుకు నియంత్రించట్లేదు? అమాయకుల సొమ్ముతో ఆటాడుకునేవారిని ఎందుకు చట్టపరంగా శిక్షించడం లేదు?
సంస్థ పేరు లేదు.. ఆ కంపెనీ నేపథ్యం తెలియదు.. కానీ, కళ్లు మిరుమిట్లు గొలిపే ఫోటోలతో ఆకర్షణీయమైన డిజైన్లు వేసి.. హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీని విక్రయిస్తోందీ ఒక సంస్థ. అమాయకులైన కొనుగోలుదారులు దీన్నే వర్చువల్ రియాల్టీ అని భావిస్తున్నారు. స్థానిక సంస్థల నుంచి అనుమతి లేదు.. రెరా నెంబరు లేదు.. అయినప్పటికీ, ఎంచక్కగా బిల్డింగ్ ఫోటోలు వేసి.. తక్కువ రేటుకే ఫ్లాట్లు అంటూ అమ్ముతున్నారు. పోచారంలో పది ఎకరాల స్థలం.. పద్నాలుగు అంతస్తుల ఎత్తు.. 952 ఫ్లాట్లు.. మొత్తం ఎనిమిది టవర్లు.. పైగా నలభై వేల చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్.. ఇలా ఓ సంస్థ యూడీఎస్ అమ్మకాల్ని చేస్తోంది. ఈ డెవలపర్ ఎవరో కొనుగోలుదారులకు తెలియదు. అతనికి పూర్వాశ్రమంలో నిర్మాణ రంగంలో అనుభవం ఉందో లేదో కూడా తెలియదు. ఎంచక్కా ఇంటర్నెట్ నుంచి అందంగా కనిపించే ఫోటోలను సేకరించి.. చదరపు అడుక్కీ రూ.2799కే ఫ్లాట్లను విక్రయిస్తామంటూ మోసం చేస్తున్నారు. ఈ కంపెనీ గొప్పతనం ఏమిటంటే.. ఫ్లాట్లను బుక్ చేసే ఏజెంట్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లాట్లు బుక్ చేసేవారికి బుల్లెట్, బంగారం, కారునూ అందజేస్తోంది. మరి, వీరు నిజంగానే ఫ్లాట్లను కడతారా.. లేక సొమ్ము తీసుకుని ఉడాయిస్తారా.. అనే సందేహం కలుగుతోంది.
రేటు తక్కువ అంటూ ఫ్లాట్లను అమ్మే వారి పట్ల కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రొఫెషనల్ బిల్డర్ ఎప్పుడైనా అనుమతులన్నీ పక్కాగా తీసుకున్నాకే మార్కెట్లో ఫ్లాట్లను విక్రయిస్తారనే విషయం మర్చిపోవద్దు. అంతేతప్ప, ఫలానా చోట స్థలం తీసుకుని అపార్టుమెంట్ కడతాం.. ఇప్పుడు కొంటే తక్కువకే ఇస్తాం.. అనుమతులన్నీ వచ్చాక రేటు పెరుగుతుందంటే ఒకసారి ఆలోచించాల్సిందే. ఒకవేళ రేటు తక్కువని మీరు అందులో ఫ్లాటు బుక్ చేశారనుకుందాం.. తర్వాత ఆయా భూమికి సంబంధించిన టైటిల్ కరెక్టుగా లేకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మళ్లీ మీ సొమ్ము వెనక్కి వస్తుందన్న గ్యారెంటీ ఉందా? మీరు ఆ సొమ్మును వెనక్కి తెచ్చుకోగలరా?
పటాన్ చెరు సమీపంలోని సుల్తాన్ పూర్‌లో మూడేళ్ల క్రితం కొందరు అమాయక బయ్యర్లు అక్రమార్కుల చేతిలో పడ్డారు. రేటు తక్కువ అనే ఒకే ఒక్క మాటను చూసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మూడేళ్లు గడిచింది. ఇప్పటికీ అతీ లేదు గతీ లేదు. హెచ్ఎండీఏ అనుమతి ఏమైందో తెలియదు. గత మూడేళ్లలో రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఇందులో ఇరుక్కుపోయిన వారు మొత్తుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఎవరికీ చెప్పుకోలేక తెలియక.. నానా కష్టాలు పడుతున్నారు. మరి, ఇలాంటి వారి జాబితాలో మీరు చేరకూడదంటే.. మోసపూరిత మాటల్ని నమ్మకూడదు.
This website uses cookies.