- బిల్డర్ కి రెరా ఆదేశం
నిర్దేశిత గడువులోగా కొనుగోలుదారుకు ఫ్లాట్ అప్పగించకుండా ఇబ్బందులు పెట్టిన బిల్డర్ వైఖరిని రెరా తప్పుబట్టింది. ఆ కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని రామప్రస్థ డెవలపర్స్ ని ఆదేశించింది. గురుగ్రామ్ సెక్టాక్ 37 సిలో చేపట్టిన స్కైజ్ ప్రాజెక్టులో ఫిర్యాదుదారు 2011 జూలైలో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం 2014 జూలైనాటికి దానిని అప్పగించాల్సి ఉంది. అయితే, గడువు ముగిసినా బిల్డర్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో దాదాపు ఐదేళ్లపాటు పోరాడిన బాధితుడు.. 2019 డిసెంబర్ లో హర్యానా రెరాను ఆశ్రయించారు. గడువులోగా తనకు ఫ్లాట్ ఇవ్వలేదని, ఇక తనకు ఆ ఫ్లాట్ వద్దని, తాను చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేలా బిల్డర్ ను ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న రెరా.. సదరు కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీకి సహా తిరిగి ఇవ్వాలని రామప్రస్థ డెవలపర్స్ కి స్పష్టంచేసింది. ఆయన చెల్లింపు చేసిన తేదీ నుంచి తిరిగి ఆయనకు సొమ్ము ఇచ్చే తేదీ వరకు వడ్డీ లెక్కించాలని పేర్కొంది.