- 10 శాతం నుంచి 15 శాతం మేర పెరగొచ్చంటున్న క్రెడాయ్
నిర్మాణ రంగ మెటీరియల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఫ్లాట్లు, విల్లాల ధరలు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) పేర్కొంది. వీటి ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 10 శాతం నుంచి 15 శాతం మేర పెరగొచ్చని వెల్లడించింది. సిమెంట్, స్టీల్ వంటి కీలక మెటీరియల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇళ్ల రేట్లు కూడా పెంచక తప్పదని వివరించింది. ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ నెలాఖరులోగా వాటిని కొనుక్కుంటే కొంత మొత్తాన్ని ఆదా చేసుకున్నట్టు అవుతుందని తెలిపింది.
కరోనా కారణంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న రియల్ రంగాన్ని ఇప్పుడు ధరల పెరుగుదల దెబ్బతీస్తోందని చెప్పింది. ‘నిర్మాణ వ్యయం పెరగడంతో ఆ మేరకు వచ్చే లాభం తగ్గిపోయింది. దీంతో ఇళ్ల రేట్లను పెంచడం మినహా డెవలపర్లకు మరో మార్గం లేదు’ అని స్పష్టంచేసింది. స్టీల్, సిమెంట్, కాపర్, పీవీసీ పైపులు సహా ఇతర నిర్మాణ రంగ మెటీరియల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని.. అలాగే అల్యూమినియం ధరలు కూడా పెరగడంతో నిర్మాణ వ్యయం బాగా ఎక్కువవుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.