Categories: LATEST UPDATES

ఎగబాకిన ఇళ్ల ధరలు

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 12 శాతం పెరుగుదల

ఢిల్లీలో అధికంగా 30 శాతం.. హైదరాబాద్ లో 7 శాతం వృద్ధి

దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు ఎగబాకుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహాల రేట్లు 12 శాతం మేర పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్లో అత్యధికంగా 30 శాతం పెరగ్గా.. హైదరాబాద్ లో 7 శాతం పెరుగుదల కనిపించినట్టు ఎగిశాయి. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లైజాస్ ఫోరాస్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

ఢిల్లీలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన ఈ పెరుగుదల 30 శాతంగా నమోదైంది. అక్కడ సగటున చదరపు అడుగు ధర రూ. రూ. 8,652 నుంచి రూ. 11,279కి పెరిగింది. బెంగళూరులో 28 శాతం వృద్ధితో ధరలు రూ. 8,688 నుంచి రూ. 11,161కి చేరాయి. పుణెలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రేట్లు 13 శాతం పెరిగి రూ. 8,540 నుంచి రూ. 9,656కి చేరాయి. అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 13 శాతం వృద్ధితో రూ. 6,507 నుంచి రూ. 7,335కి పెరిగాయి. హైదరాబాద్, కోల్ కతాల్లో 7 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర రూ.10,530 నుంచి రూ.11,290కి చేరగా.. కోల్ కతాలో రూ.7,315 నుంచి రూ.7,745కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్‌)లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగి రూ. 19,111 నుంచి రూ. 20,275కి చేరాయి.

చెన్నైలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా ఇళ్ల ధరలు రూ. 7,690 స్థాయిలోనే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. త కొద్ది త్రైమాసికాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో జోరు కొనసాగుతోందని.. డిమాండ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రాధాన్య అసెట్‌ క్లాస్‌గా ప్రజలు రియల్ ఎస్టేట్‌ వైపు మళ్లుతుండటం వల్ల ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. రేట్లు పెరిగినప్పటికీ పలు నగరాల్లో అమ్మకాలు కూడా పెరిగినట్లు లైజాస్‌ ఫోరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ వివరించారు. గత కొద్ది త్రైమాసికాలుగా హౌసింగ్‌కు డిమాండ్ మెరుగ్గా ఉంటోందని కోలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు.

This website uses cookies.