Categories: LATEST UPDATES

పెరుగుతున్న ఇంటి అద్దెలు!

కరోనా తర్వాత దేశంలోని రియల్ రంగం గాడిన పడుతుండగా.. మరోవైపు నివాస అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఖరీదైన నివాస కాలనీల్లో అద్దెలు గత రెండేళ్లలో 8 నుంచి 18 శాతం మేర పెరిగినట్టు అన‌రాక్ సంస్థ వెల్లడించింది. అయితే, అదే సమయంలో మూలధన విలువ మాత్రం 2 నుంచి 9 శాతమే పెరిగిందని పేర్కొంది. గత రెండేళ్లలో చాలా లగ్జరీ హౌసింగ్ మార్కెట్లు అద్దెల్లో రెండంకెల వృద్ధిని సాధించాయని అన‌రాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు.

కోవిడ్ ముందు ఒక నిర్దిష్ట సమయంలో రెండేళ్ల లగ్జరీ నివాసాల అద్దెలు 5 నుంచి 7 శాతం మాత్రమే పెరిగాయని వివరించారు. కరోనా తర్వాత అద్దెదారులు పెద్ద పరిమాణం ఉన్న గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారని, ఫలితంగా అద్దెల్లో పెరుగుదల నమోదైందని తెలిపారు. బెంగళూరు జేపీ నగర్ లో 2020లో రూ.46వేలు ఉన్న అద్దె 2022లో 13 శాతం పెరిగి రూ.52 వేలకు చేరింది. అదే సమయంలో మూలధన విలువ చదరపు అడుగుకు 9 శాతం పెరిగి రూ.6200కి చేరింది. చెన్నై అన్నా నగర్ లో సగటు అద్దెలు నెలకు రూ.56వేల నుంచి 13 శాతం మేర పెరిగి రూ.63వేలకు చేరుకున్నాయి. మూలధన ధరలు చదరపు అడుగుకు 5 శాతం పెరిగి రూ.11,850కి చేరింది.

మన హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో సగటు నెలవారీ అద్దె 15 శాతం పెరిగి రూ.62 వేలకు చేరింది. హైటెక్ సిటీలో అద్దెలు 11 శాతం పెరిగి 59 వేలకు చేరాయి. ఇక ముంబై తర్డో ప్రాంతానికి వస్తే.. రెండేళ్ల క్రితం రూ.2.7 లక్షల అద్దె ఉన్న ఇల్లు ఇప్పుడు రూ.3.1 లక్షలకు చేరింది. మూలధన ధరలు 3 శాతం మేర పెరిగి రూ.43 వేలు అయింది. వర్లీలో రూ.2లక్షలు అద్దె ఉన్న ఇల్లు.. 3 శాతం మేర పెరిగి రూ.2.35 లక్షలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ అద్దెల్లో 11 శాతం పెరుగుదల నమోదైంది. గతంలో రూ.70వేలు ఉన్న ఇల్లు.. ఇప్పుడు రూ.78వేలకు చేరింది. మూలధన విలువ మూడు శాతం పెరిగి రూ.13,500కి చేరింది.

This website uses cookies.