Categories: TOP STORIES

పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు

6 శాతం వార్షిక వృద్ధి నమోదు

కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ పరిశ్రమ గాడిన పడింది. గతేడాది ప్రాపర్టీ ధరలు సగటున 6 శాతం పెరిగాయి. 2021లో చదరపు అడుగు ధర సగటున రూ.5,826 ఉండగా.. 2022లో అది రూ.6,150కి చేరింది. దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరుల్లో ఈ పెరుగుదల పది శాతం ఉండటం విశేషం. ఈ మేరకు అనరాక్ సంస్థ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది కూడా ఇదే ఒరవడి కొనసాగే అవకాశం ఉందని.. పెద్ద నగరాల్లో ప్రాపర్టీ ధరలు మరో 5 నుంచి 8 శాతం పెరగొచ్చని పేర్కొంది.

ప్రస్తుతం ఏడు ప్రధాన నగరాల్లో ధర చదరపు అడుగుకు రూ.6,150గా ఉంది. గత ఐదేళ్ల ధరలతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. 2018లో చదరపు అడుగు ధర రూ.5,551 ఉండగా.. 2022లో అది రూ.6,150కి పెరిగింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ సగటు ప్రాపర్టీ ధరల్లో గరిష్టంగా ఐదేళ్లలో 10 శాతం పెరుగుదల నమోదు చేశాయి. బెంగళూరులో సగటు ప్రాపర్టీ ధరలు 2018లో చదరపు అడుగుకు రూ.4,894 ఉండగా.. 2022లో అది రూ.5,570కి పెరిగింది.

హైదరాబాద్ విషయానికొస్తే.. 2018లో చదరపు అడుగు సగటు ధర రూ.4,128 ఉండగా.. 2022లో 4,620కి చేరింది. ఇక అద్దె సంగతి చూస్తే.. 2019తో పోలిస్తే 2020లో చాలా నగరాల్లో అద్దె ఆదాయం తగ్గింది. కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితం కావడంతో చాలామంది ప్రధాన నగరాల్లో ఇళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోవడంతో కార్యాలయాల పని లేకుండా పోయింది. ఫలితంగా అద్దె ఆదాయం గణనీయంగా తగ్గింది. అయితే, 2021లో కాస్త పెరుగుదల నమోదు కాగా.. 2022లో బాగానే ఊపందుకుంది. అద్దెల్లో 3.9 శాతం పెరుగుదలతో ముంబై బెంగళూరు తొలి స్థానంలో ఉండగా.. 3.8 శాతం పెరుగుదలతో ముంబై రెండో స్థానంలో ఉంది.

This website uses cookies.