(కింగ్ జాన్సన్ కొయ్యడ)
రాష్ట్రంలో యూడీఎస్, ప్రీలాంచుల అక్రమార్కులు పెట్రేగిపోతుంటే.. తెలంగాణ రెరా అథారిటీ కళ్లు మూసుకుందని.. పెద్దగా పట్టించుకోవడం లేదని అనుకోవద్దు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నట్లుగా రెరా అథారిటీ.. ఈ పథకాలపై లోతైన అధ్యయనం చేస్తుందని సమాచారం. సోషల్ మీడియాలో వెలువెత్తుతున్న యూడీఎస్, ప్రీ లాంచ్ వెంచర్లు, ప్రాజెక్టుల వివరాల్ని సేకరిస్తోందని.. రెరా సిబ్బంది ఆయ సంస్థల వద్దకు తనిఖీకి వెళుతున్నారని తెలిసింది. కంపెనీల నుంచి యూడీఎస్, ప్రీ లాంచులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారని.. అందుకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలిస్తున్నారని సమాచారం. మొత్తానికి, ప్రాజెక్టు సైజును బట్టి జరిమానాను విధించే పనిలో నిమగ్నమైందని.. ఈ క్రమంలో ఒక సంస్థపై ఎంతలేదన్నా రూ.2 కోట్ల దాకా జరిమానా విధించే అవకాశముందని తెలిసింది.
హైదరాబాద్ రియల్ రంగంలో దారుణమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ఎండీని పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా తేనెతుట్టును కదిపినట్టు అయ్యింది. ఈ బాటలో ఇంకెంత మంది బిల్డర్లు ఉన్నారో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. సరికొత్త మోసాలకు తెలంగాణ నిర్మాణ రంగం కేంద్రబిందువు కావడం దారుణమైన విషయం. విచిత్రమేమిటంటే.. యూడీఎస్, ప్రీలాంచ్ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్న వారు తాము ఎవరినీ మోసం చేయడం లేదని విచిత్ర వాదన చేస్తున్నారు. రెరా అనుమతి లేకుండా అమ్మకాల్ని ఆరంభించడం.. యూడీఎస్, ప్రీలాంచులు అంటూ కొనుగోలుదారుల్నుంచి చెక్కులు తీసుకోవడం.. అవసరమైతే నగదు వసూలు చేయడం వంటివి వీరికి తప్పుగా అనిపించడం లేదు. ప్రీ లాంచులో అమ్మడం వల్ల కొనుగోలుదారులకు సేవ చేస్తున్నామనే బిల్డప్పు ఇవ్వడం దారుణమైన విషయం.
2006 నుంచి హైదరాబాద్ రియల్ పరిశ్రమ సంఘటిత రంగంగా మారుతూ వచ్చింది. ఇందులో అనేక నిర్మాణ సంస్థల పాత్ర మరువలేనిది. అడపాదడపా పలు కంపెనీలు కొనుగోలుదారుల్ని ఇబ్బంది పెట్టినా.. నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పెద్దగా పడలేదు. అధిక శాతం సంస్థలు పద్ధతి ప్రకాం నిర్మాణ కార్యకలాపాల్ని నిర్వహించాయి. దురదృష్టం ఏమిటంటే.. కొంతకాలం నుంచి యూడీఎస్, ప్రీలాంచ్ మోసాలకు నగరం కేంద్రబిందువుగా మారింది. ఇందులో కొందరు బడా బిల్డర్ల పాత్ర కూడా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. వీరిని నియంత్రించే దమ్మూ కానీ ధైర్యం కానీ తెలంగాణ నిర్మాణ సంఘాలకు లేదనే విషయం ప్రభుత్వానికీ అర్థమైంది. అలాగనీ, ఈ స్కామ్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం పెద్దగా ప్రయత్నిస్తున్న దాఖలాల్లేవు. ఇలాంటి ప్రాజెక్టుల్లో కొనకూడదని ఏదో మొక్కుబడిగా పురపాలక శాఖ ఆదేశాలిచ్చి చేతులు దులిపేసుకుంది. అంతేతప్ప, ఒక పక్కా వ్యూహంతో నియంత్రించేందుకు ప్రయత్నించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నిర్మాణ రంగం.. ఢిల్లీలోని గుర్గావ్, నొయిడా స్థాయికి చేరుకుందని ఇటీవల జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే అర్థమవుతోంది. స్థల యజమానితో మాట్లాడేదొకరు.. అతనికి అడ్వాన్సు ఇచ్చేది మరొకరు.. ఆయా స్థలాన్ని మార్కెట్లో అమ్మకానికి పెట్టేది ఇంకొకరు.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో ప్లాట్లు, ఫ్లాట్లను అమ్మించెదొకరు.. కొన్న ప్లాటు లేదా ఫ్లాటుకు సంబంధించిన యూడీఎస్ స్థలాన్ని రిజిస్టర్ చేసేది మరొకరు.. మొత్తానికి, బిల్డరుతో కొనుగోలుదారులకు ప్రత్యక్ష సంబంధం లేకుండా రియల్ రంగం అభివృద్ధి చెందింది. మరి, ఇలాంటి అభివృద్ధి దేనికి సంకేతం? పరిశ్రమలో కళ్ల ముందే ఇంత వికృత చర్యలు జరుగుతున్నా తెలంగాణ నిర్మాణ సంఘాలు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంఘాలన్నీ కలిసికట్టుగా ఇప్పటికైనా మేల్కోకపోతే, ఢిల్లీలో విఫలమైనట్లే మన నిర్మాణ సంఘాలు విఫలమయ్యే అవకాశముంది. వీటి మీద ప్రజలు నమ్మకం కోల్పోతే మాత్రం.. మళ్లీ వారి విశ్వాసాన్ని పొందడమెంతో కష్టం.
తెలంగాణ రెరా అథారిటీ అనుమతి తీసుకోకుండా ప్రాజెక్టును కడితే… ఆయా ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధిస్తారు. లేఅవుట్ అయినా ప్రాజెక్టు అయినా ఓ వంద కోట్ల విలువ ఉందనుకుంటే.. అందులో పది శాతం అంటే.. పది కోట్ల దాకా జరిమానా కట్టాల్సిందే. మరి, బిల్డర్ కానీ రియల్టర్ కానీ యూడీఎస్, ప్రీ లాంచుల్లో వసూలు చేసిన మొత్తంలో కొంత స్థల యజమానికి, ఆతర్వాత రెరాకు జరిమానా కడితే.. ప్రాజెక్టు ముందుకెళుతుందా? అసలా డెవలపర్ కోలుకుంటాడా? మరి, అందులో కొన్నవారి పరిస్థితి ఏమిటి? వారి సొంతింటి కల సాకారం అవుతుందా? పోనీ, అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టిన వారి సొమ్ము తిరిగి వాపసు వస్తుందా? నగరంలోని పలు వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టినవారు రెండేళ్ల నుంచి డెవలపర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారి చేతికి స్థలం రాలేదు. పెట్టిన పెట్టుబడి వాపసు రాలేదు. పెట్టుబడి పెట్టిన వారేమో ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. మొత్తానికి, ఇలాంటి తలనొప్పులు వద్దనుకుంటే.. యూడీఎస్, ప్రీ లాంచ్ ప్రాజెక్టుల్ని ఆరంభించకపోవడమే మంచిది. ఎవరైనా అత్యాశతో ప్రారంభించినా అందులో కొనకపోవడమే ఉత్తమం.
This website uses cookies.