ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దానిని పూర్తి చేసే లోపు కనీసం మూడు నాలుగు సార్లు ఆ నిర్మాణంపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిందేనని బిల్డర్లకు హర్యానా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు నిర్మాణాల్లో అనుసరించాల్సిన సురక్షిత ప్రమాణాలను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్డర్లు నిబంధనలు సరిగా పాటించడంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. 1985 నుంచి ఇప్పటివరకు 2వేల మంది బిల్డర్లలో కేవలం 15 మంది మాత్రమే కంప్లీషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారని పేర్కొన్నారు.
ప్లాన్ కి అనుగుణంగా సదరు బిల్డర్ ఆ కాలనీలో అన్ని పనులూ పూర్తి చేసినట్టు ధ్రువీకరించి ఇచ్చే ఈ సర్టిఫికెట్ తీసుకోవడంలో అశ్రద్ధ కనబరుస్తున్నారని విమర్శించారు. ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఆ కాలనీ నిర్వహణను సదరు బిల్డర్ ఐదేళ్ల పాటు చూడాల్సి ఉంటుందని, తర్వాత ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని సూచించారు. వంద మంది డెవలపర్ల జాబితా రూపొందించి వారి పెండింగ్ లో పెట్టిన పనులు పూర్తి చేయించాలని, అనంతరం వాటిని సంబంధిత వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగించాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగాన్ని ఖట్టర్ ఆదేశించారు.
ఈ పనులన్నీ నిర్ణీత సమయంలోగా పారదర్శకంగా చేయించేందుకు వీలుగా ఓ నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఈ పనులన్నింటినీ తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ ప్రాజెక్టులను సరైన రీతిలో అప్పగించేందుకు వీలుగా ఓ విధానం తీసుకురానున్నట్టు ప్రకటించారు.
This website uses cookies.