Categories: TOP STORIES

సాహితీ స్వాహాపర్వం రూ.1800 కోట్లు..

దర్యాప్తులో తేల్చిన సీసీఎస్ పోలీసులు

ప్రీలాంచ్ పేరుతో ఎర వేసి పలువురిని నట్టేట ముంచిన సాహితీ ఇన్ ఫ్రా సంస్థ వ్యవహారంలో కళ్లు తేలేసే నిజాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తం కుంభకోణం విలువ రూ.1800 కోట్లు అని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 9 ప్రాజెక్టుల పేరుతో పలువురి దగ్గర భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు తేలింది. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును సొంత అవసరాలకు వాడుకున్నట్టుగా గుర్తించారు. 2019లోనే ఈ కుంభకోణానికి బీజం పడింది.

అమీన్ పూర్ లోని సర్వే నెంబర్ 343లో ఉన్న 23 ఎకరాల్లో 10 టవర్లలో 32 అంతస్తులు నిర్మిస్తామని చెప్పి ప్రీ లాంచ్ పేరుతో డబ్బు వసూళ్లు ప్రారంభించారు. ఇలా 1752 మంది నుంచి రూ.504 కోట్లు వసూలు చేశారు. అయితే, రోజులు గడుస్తున్నా ప్రాజెక్టు ప్రారంభించకపోవడంతో 2022 ఆగస్టులో పలువురు బాధితులు సాహితీ ఇన్ ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీనారాయణపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు.

సంస్థ డైరెక్టర్లు సహా మొత్తం 22 మంది ప్రీలాంచ్ పేరుతో పలువురి నుంచి డబ్బు వసూలు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అసలు ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులేవీ కూడా తీసుకోలేదని తేలింది. పైగా 23 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారని.. మిగిలిన 13 ఎకరాల్లో 9 ఎకరాలు సేల్స్ అగ్రిమెంట్ పై, మరో 4 ఎకరాలు అన్ రిజిస్టర్డ్ సేల్స్ అగ్రిమెంట్ పై తీసుకున్నట్టు గుర్తించారు. ఈ ప్రాజెక్టులో కొనుగోలుదారుల నుంచి తీసుకున్న రూ.504 కోట్ల డబ్బుతోనే మరో 9 ప్రాజెక్టులు ప్రారంభించి.. వాటి పేరుతో కూడా డబ్బు వసూలు చేసినట్టు తేలింది.

నానక్ రామ్ గూడలో సాహితీ స్వాధ‌ కమర్షియల్ ప్రాజెక్టు పేరుతో 69 మంది నుంచి రూ.65 కోట్లు, కొంపల్లిలో శిష్ట అడోబ్ పేరిట 248 మంది నుంచి రూ.79 కోట్లు, కొంపల్లిలోనే సాహితీ గ్రీన్ పేరిట 153 మంది నుంచి రూ.40 కోట్లు, గచ్చిబౌలి రోలింగ్ హిల్స్ లో సాహితీ సితార కమర్షియల్ పేరుతో 269 నుంచి రూ.135 కోట్లు, బంజారాహిల్స్ లో సాహితీ మహితో సెంట్రో పేరిట 44 మంది నుంచి రూ.22 కోట్లు, నిజాంపేటలో ఆనంద్ ఫార్చ్యూన్ పేరుతో 120 మంది నుంచి రూ.46 కోట్లు, గచ్చిబౌలిలో సాహితీ కృతి బ్లూసమ్ పేరతో 25 మంది నుంచి రూ.16 కోట్లు, మోకిలలో సాహితీ సుదీక్ష పేరుతో 30 మంది నుంచి రూ.22 కోట్లు, బాచుపల్లిలో రూబీ కన్ స్ట్రక్షన్స్ పేరిట 43 మంది నుంచి రూ.69 కోట్లు..

ఇలా మొత్తం ఇప్పటివరకు రూ.1164 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లతోపాటు మెదక్ జిలాల పరిధిలో సాహితీ మోసాలపై పలు పోలీస్ స్టేషన్లలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. వాటిని గతేడాది సెప్టెంబర్ లో సీసీఎస్ కు బదిలీ చేశారు.

This website uses cookies.