దేశీ రియల్టీ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో 26 శాతం క్షీణించాయి. ఫలితంగా ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 2.65 బిలియన్ డాలర్లకు మత్రమే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రభావం చూపినట్లు అనరాక్ క్యాపిటల్ పేర్కొంది.
గతేడాది(2022-23) తొలి 9 నెలల్లో దేశ రియల్టీ రంగంలోకి 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 26 శాతం క్షీణించాయి. తాజాగా నమోదైన పీఈ పెట్టుబడుల్లో 84 శాతం ఈక్విటీ రూపేణా లభించగా.. రుణాలుగా మిగిలిన నిధులను అందించినట్లు ఫ్లక్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో అనరాక్ తెలిపింది. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 79 శాతం నుంచి 86 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో దేశీ పెట్టుబడుల వాటా 14 శాతం తగ్గింది. దేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సగానికి తగ్గి 36 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.
గతేడాది తొలి 9 నెలల్లో రియల్టీలో 71.7 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు బలహీనపడటంతో రియల్టీలో మొత్తం పీఈ పెట్టుబడులు తగ్గినట్టు అనరాక్ పేర్కొంది. అంతర్జాతీయ అనిశ్చితులు, అధిక వడ్డీ రేట్ల వాతావరణం కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు మందగించినట్లు వివరించింది. వ్యయభరిత నిధుల కారణంగా రెసిడెన్షియల్ రియల్టీ రుణ విభాగానికి డిమాండ్ తగ్గడంతో దేశీ ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్స్(ఏఐఎఫ్) నుంచి లావాదేవీలు తగ్గాయి.
This website uses cookies.