Categories: TOP STORIES

లగ్జరీ ఫ్లాట్ల‌కు అదే డిమాండ్

3, 4 బీహెచ్ కేలకే ఎక్కువ మంది మొగ్గు

కనీసం 1500 నుంచి 2వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకే ఓటు

దేశంలో లగ్జరీ అపార్ట్ మెంట్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఇళ్ల కొనుగోలుదారుల్లో చాలామంది 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఇళ్లనే ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో ధరల పెరుగుదలను కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. 2 బీహెచ్ కే కంటే విశాలంగా, సౌకర్యవంతంగా ఉండటంతో పలువురు 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు.

కరోనా తర్వాత జీవనశైలిలో వచ్చిన మార్పులు, హైబ్రిడ్ వర్కింగ్ విధానం వంటి అంశాలు చదువుకు, ఉద్యోగ విధులకు ప్రత్యేక గదులు కావాల్సి ఉండటంతో పెద్ద అపార్ట్ మెంట్లకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో 1000 చదరపు అడుగుల 2 బీహెచ్ కేలకే విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరాల్లో 1500 చదరపు అడుగుల నుంచి 2వేల చదరపు అడుగులు కార్పెట్ ఏరియా ఉన్న ఇళ్లనే కొనుక్కుంటున్నారు. అలాగే లగ్జరీ సెగ్మెంట్ లో కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో 5వేల చదరపు అడుగులకు పైగా కార్పెట్ ఏరియా ఉన్న ఇళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

పెద్ద పెద్ద ఇళ్లు, ఆధునిక సౌకర్యాలు ఉన్న ఇళ్లే కొనుగోలుదారుల ఎంపికలో ప్రధమ ప్రాధాన్యతగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి, సంపద పెరగడం వంటి అంశాలు నివాసితులను ఆధునిక సౌకర్యాల దిశగా అడుగులు వేయిస్తున్నాయి. ఆదాయంలో పెరుగుదల, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడటం వంటివాటితో మిలీనియల్స్ పెద్ద పెద్ద ఇళ్లు కొనుక్కుంటున్నారు. సౌకర్యవంతంగా ఉండటంతోపాటు సమాజంలో స్టేటస్ సింబల్ గా ఉంటుందనే కారణంతోనే ఎక్కువ మంది విశాలమైన, లగ్జరీ ఇళ్లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో తొలిసారి ఇల్లు కొంటున్నవారు విశాలమైన ఇంటికే ఓటు వేస్తుండగా.. ఇప్పటికే ఇల్లు ఉన్నవారు పెద్ద ఇంటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అధిక ఆదాయం పొందుతుండటం కూడా ఇందుకు దోహడపడుతోంది.

ఫిక్కీ అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే ప్రకారం.. భారతీయల్లో దాదాపు 50 శాతం మంది 3 బీహెచ్ కే ఇళ్లవైపు మొగ్గు చూపిస్తుండగా.. 37 శాతం మంది 2 బీహెచ్ కే కొనుగోలుకు ఓటేశారు. బెంగళూరు, చెన్నై, ఢిలీ, హైదరాబాద్ వంటి నగరాల్లో 3 బీహెచ్ కే అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. అలాగే 75 శాతం మంది కొనుగోలుదారులు తమ ఇంటికి బాల్కనీ తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే 31 శాతం మంది ఆఫీస్ పనుల కోసం ప్రత్యేక స్పేస్ ఉండాలని అభిలషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లగ్జనీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది.

This website uses cookies.