ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి
కరోనా తర్వాత దేశంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తున్నప్పటికీ, తాజాగా దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు కాస్త తగ్గాయ్. దేశవ్యాప్తంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 2 శాతం మేర తగ్గే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణా సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 20 శాతం తక్కువగా 15,016 యూనిట్లకు పరిమితమవుతాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 18,757 యూనిట్ల అమ్మకాలు నమోదుకాగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గనుంది. పుణెలో గతేడాది త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు విక్రయాలు 15 శాతం క్షీణతతో 22,482 యూనిట్లుగా ఉంటాయని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో జూన్ త్రైమాసికంలో 1,19,901 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదు కావచ్చని, గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,21,856 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో ఈ తొమ్మిది నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 1,46,194 యూనిట్లుగా ఉన్నాయని, దీంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో విక్రయాలు 18 శాతం తగ్గినట్టు పేర్కొంది. జూన్ త్రైమాసికంలో నగరాలవారీగా ఇళ్ల అమ్మకాలు చూస్తే.. ఢిల్లీలో 10,198 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చన్నది ప్రాప్ టైగర్ అంచనా. గతేడాది కంటే ఇది 6 శాతం అధికం. గతేడాది ఇదే సమయంలో అక్కడ 9,635 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరు విషయానికి వస్తే.. గతేడాది జూన్ త్రైమాసికంలో 15,127 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 15,088 యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. చెన్నైలో గతేడాది జూన్ త్రైమాసికంలో 4,950 ఇళ్లు విక్రయం కాగా ఈ ఏడాది ఇదే సమయంలో 4,841 యూనిట్లు అమ్మడు కావచ్చని అంచనా వేసింది.
కోల్‌కతాలో విక్రయాలు 25 శాతం వృద్ధితో 4,025 యూనిట్ల నుంచి 5,130 యూనిట్లకు చేరవచ్చని పేర్కొంది. ముంబైలో అమ్మకాలు 13,032 యూనిట్లకు పరిమితం కావొచ్చని.. గతేడాది ఇదే సమయంలో 13,219 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయని వివరించింది. నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాలు 36 శాతం వృద్ధితో 9,035 యూనిట్లకు చేరవచ్చని తెలిపింది. థానేలో ఇళ్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 25,041 యూనిట్లకు చేరవచ్చని ప్రాప్ ఈక్విటీ నివేదిక అంచనా వేసింది.
This website uses cookies.