* శ్రీధర్‌రావు అరెస్టు
* ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు
* తర్వాతేం జరుగుతుందో!
నా వెనకాల ఎవరున్నారో తెలుసా.. అని కొందరు ప్రమోటర్లు తెగ బిల్డప్ ఇస్తుంటారు. నేను మోనార్క్‌ని.. ఎవర్ని మోసం చేసినా.. నన్నెవరేం చేయలేరని మరికొందరు బిల్డర్లు హడావిడి చేస్తుంటారు. అసలు అధికారమంతా తమ చెప్పు చేతల్లో ఉందని.. తాము ఆడిందే ఆట పాడిందే పాటగా భావిస్తుంటారు.. కాదు కాదు.. అలాంటి భ్రమల్లో బ్రతికేస్తుంటారు. అయితే, అలాంటి వారినీ చూస్తూ చట్టం ఊరుకోదని.. తన పని తాను చేసుకుంటూ వెళుతుందని.. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు విషయంలో మరోసారి నిరూపితమైంది. అమితాబ్ బంధువు నుంచి సుమారు రెండున్న ర కోట్లు తీసుకుని వెనక్కి ఇవ్వలేదనే అభియోగం మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం నుంచి హైదరాబాద్ విచ్చేసి అరెస్టు చేశారు. అయితే, ఈ మొత్తానికే అరెస్టు చేస్తారా? సొమ్ము ఇంకా ఎక్కువే ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
శ్రీధర్ రావు అరెస్టు కావడం ఇది తొలిసారేం కాదు. ఈ మధ్యకాలంలో అత్తగారి ఇంటికి వెళ్లి వస్తున్నట్టుగానే ఆయన అలా జైలుకెళ్లి ఇలా వెనక్కి వచ్చేస్తున్నాడు. ఈయన చేతిలో మోసపోయింది కేవలం అమితాబ్ బందువే కాదు.. ఇంకా జాబితాలో ఎక్కువ మంది ఉన్నారని సమాచారం. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఈయనతో సత్సంబంధాలున్నాయని.. అందుకే, వీరంతా శ్రీధర్ రావుని నిత్యం కాపాడుతుంటారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల హైదరాబాద్ బిల్డర్లంటే జాతీయస్థాయిలో పరువు పోతుందని కొందరు డెవలపర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి, తను ఎంతకాలం ఢిల్లీలో ఉంటాడు? ఎన్ని రోజులపాటు జైలులో ఉంచుతారు? ఇలాంటి విషయాలన్నీ తెలియడానికి మరి కొంతకాలం పడుతుంది.