Categories: LATEST UPDATES

ఇంటి నుంచి.. ఇంత త‌క్కువా?

స‌త్య‌నారాయ‌ణ ముంబైలో ఒక ఐటీ దిగ్గ‌జ సంస్థ‌లో ప‌ని చేసేవాడు. లాక్ డౌన్‌లో సొంతూరికి వ‌చ్చేశాడు. విద్యుత్తు సౌక‌ర్యం మెరుగ్గా ఉండ‌టం, ఐటీ బ్రాండ్ బాండ్ సేవ‌లూ ల‌భించ‌డంతో దాదాపు రెండేళ్ల నుంచి ఇంట్లో నుంచి ప‌ని. ఆఫీసు మొదలై ఒకవేళ బెంగ‌ళూరు వెళ్లాల్సి వ‌చ్చినా లేక హైద‌రాబాద్‌కు వెళ్లినా పిల్ల‌ల స్కూలుకు ఇబ్బంది కావొద్ద‌ని భావించాడు. ఈ నేప‌థ్యంలో 2020 ఏప్రిల్లోనే మూడు న‌గ‌రాల్లో స్కూలు కోసం వెతికాడు. బెంగ‌ళూరులో స్కూలు అడ్మిష‌న్ కోసం అడిగితే ల‌క్ష‌న్న‌ర చెప్పారు. హైద‌రాబాద్‌లో ల‌క్ష రూపాయ‌లు.

అదే సొంతూర్లో సేమ్ స్కూల్‌లో క‌నుక్కుంటే రూ.25 వేలే క‌ట్టించుకున్నారు. ఎంచ‌క్కా పిల్ల‌ల్ని సొంతూర్లోనే చేర్పించాడు. దీంతో ఫీజులతో పాటు ఇత‌ర‌త్రా ఖ‌ర్చులు క‌లిసొచ్చాయి. ఊర్లోనే కాబ‌ట్టి ఖ‌ర్చూ పెద్ద‌గా కావ‌ట్లేదు. రెండేళ్ల నుంచి పొదుపు చేసిన మొత్తాన్ని తీసుకొచ్చి.. హైద‌రాబాద్‌లో ఒక మంచి లొకేష‌న్‌లో ఫ్లాట్ కొనే వేట‌లో ప‌డ్డాడు.

కొంద‌రు ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే.. రెండేళ్ల నుంచి పొదుపు చేసిన మొత్తాన్ని తీసుకెళ్లి.. రేటు త‌క్కువ‌గా చెప్పే ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను కొనేస్తున్నారు. వీరంతా రెండేళ్ల క‌ష్టార్జితాన్ని మొత్తం తీసుకెళ్లి అన‌వ‌స‌రంగా అక్ర‌మార్కుల చేతుల్లో పోస్తున్నారు. కేవ‌లం రేటు త‌క్కువనే ఒకే ఒక్క అంశం కార‌ణంగా ప్రీలాంచుల్లో, యూడీఎస్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తున్నారు.

ఆయా బిల్డ‌ర్ స‌కాలంలో ఫ్లాటును అందించ‌గ‌ల‌డా? గ‌తంలో ఎన్ని అపార్టుమెంట్ల‌ను స‌కాలంలో అంద‌జేశాడు? నిర్మాణాల్ని నాణ్యంగా క‌ట్ట‌డంలో అత‌ని ట్రాక్ రికార్డు ఏమిట‌నే అంశాన్ని ప‌రిశీలించాకే తుది నిర్ణ‌యం తీసుకోవాలి. లేక‌పోతే, రానున్న రోజుల్లో ఆయా డెవ‌ల‌పర్ చేతులెత్తేశాడంటే.. అంతే సంగ‌తులు. ఈ జాబితాలో చిన్న బిల్డ‌ర్లే కాదు.. పెద్ద పెద్ద డెవ‌ల‌ప‌ర్లూ ఉన్నార‌నే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు. కాబ‌ట్టి, రెరా అనుమ‌తి గ‌త ప్రాజెక్టుల్లో కొంటేనే.. డెవ‌ల‌ప‌ర్‌తో ఎలాంటి ఇబ్బందులొచ్చినా.. ప్ర‌భుత్వం నుంచి పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంది. మీ సొమ్ముకు పూర్తి స్థాయి భ‌రోసా ల‌భిస్తుంది.

This website uses cookies.