భారతదేశ అతిపెద్ద బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ కొనుగోలుదారుల కోసం పండగ బొనాంజా ప్రారంభించింది. కొనుగోలుదారులందరికీ గృహ రుణాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బొనాంజా ప్రారంభించినట్టు తెలిపింది. ఇందులో భాగంగా గృహ రుణాలపై 0.25 శాతం, టాప్ అప్ రుణాలపై 0.15 శాతం, ఆస్తి రుణాలపై 0.30 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే 2023 జనవరి 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా రద్దు చేసింది.
హోమ్ ఫైనాన్స్ లో అగ్రగామిగా ఉన్నందున ప్రతి భారతీయుడి సొంతింటి కల నిజం చేసేందుకు ఎస్ బీఐ కృషి చేస్తుందని బ్యాంకు చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. తమపై విశ్వాసంతో తమను ఎంచుకున్న 2.8 మిలియన్లకు పైగా కుటుంబాలతో కూడిని వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, గృహ రుణ విభాగంలో 6 ట్రిలియన్ ఆస్తులను చేరుకున్నట్టు వెల్లడించారు. కాగా, కొత్త గృహ రుణాలు, టేకోవర్ కొనుగోలుదారులకు వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతుందని.. ఫర్నిషింగ్, పునర్నిర్మాణం, ఇంటి మేకోవర్ కోసం టాప్ అప్ రుణాలు 8.8 శాతం నుంచి మొదలవుతాయని ఎస్ బీఐ రిటైల్ బ్యాంకింగ్, ఆపరేషన్స్ ఎండీ అలోక్ కుమార్ చౌదరి తెలిపారు.