పదేళ్లు గడిచినా ఫ్లాట్లు అప్పగించని సంస్థపై రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీఆర్డీసీ) కన్నెర్ర జేసింది. వెంటనే ముగ్గురు ఫిర్యాదుదారుల సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయాలని ఏలియన్స్ సంస్థను ఆదేశించింది. ఈ సంస్థ మెదక్ జిల్లా తెల్లాపూర్ లో ఏలియన్స్ స్పేస్ స్టేషన్ పేరుతో భారీ అపార్ట్ మెంట్ కట్టబోతున్నామని 2008లో పలువురిని ఆకర్షించింది. దీంతో కొందరు సొమ్ము చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు.
అయితే, నిర్దేశిత గడువు దాటపోయి, అదనంగా పదేళ్లు గడిచినా ఫ్లాట్లు అప్పగించలేదు. దీంతో ముగ్గురు వ్యక్తులు కమిషన్ ను ఆశ్రయించారు. వాద ప్రతివాదనలు విన్న కమిషన్.. ఈ వ్యవహారంలో సంస్థ వైపు నుంచి సేవాలోపం స్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన హేమలతా కిషోర్ కి రూ.20.84 లక్షలు, హస్ముక్ మోహన్ బబారియాకు రూ.22.85 లక్షలు, హైదరాబాద్ వాసి మురళీధర్ వాసనాభికి రూ.20.6 లక్షలను 9 శాతం వడ్డీని పదేళ్ల కాలానికి లెక్కించి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిహారం కింది రూ.లక్ష, ఖర్చుల కోసం రూ.10వేలు చెల్లించాలని సూచించింది.