- రిటైర్మెంట్ ప్లానింగ్ కంటే రెండో ఇల్లు కొనడం మేలు
- అద్దె ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం
- ప్రాపర్టీ విలువ కూడా క్రమేణా పెరిగే చాన్స్
పదవీ విరమణ సమయం వచ్చినపపుడు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతారు. బంగారం, మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీసు పథకాలు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నప్పుడు.. ఎటువైపు మొగ్గు చూపితే మెరుగని నిపుణులు అంటున్నారు.
చాలామంది నెలవారీ ఆదాయం వచ్చేలా పెన్షన్ పథకాల్లో పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు. ఇందుకు మూచ్యువల్ ఫండ్స్ నుంచి నెలవారీ ఆదాయ ప్రణాళికలు, బంగారం వరకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, అలాంటి వాటిలో రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టడం ఒకటి. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పథకాలలో కాకుండా రెండో ఇంటిని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ‘కాలక్రమేణా ఆస్తి విలువ పెరుగుతుంది. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టడం మంచిది.
మీ కార్పస్ ఫండ్ ను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే సందిగ్ధం వచ్చినప్పుడు కచ్చితంగా రెండో ఇంటివైపే మొగ్గు చూపండి. ప్రాపర్టీపై పెట్టుబడుల వల్ల క్రమం తప్పకుండా అద్దె ద్వారా ఆదాయం వస్తుంది. ఇది బంగారం లేదా మూచ్చువల్ ఫండ్స్ ద్వారా వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. మీ పెన్షన్ కంటే అద్దె ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపు ఉండటం ఖాయం. ఇది రిటైరైనవారికి బాగా ప్రయోజనం చేకూరుస్తుంది’ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చాలా సందర్భాల్లో ఆస్తి విలువ క్రమేణా పెరుగుతుందని.. అదే విధంగా అద్దె ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. ఇక ఖర్చులు కూడా అదే తరహాలో ఉన్నప్పటికీ, పెరుగుతున్న అద్దెలు పెరుగుతున్న ఆదాయానికి మూలంగా ఉంటాయన్నారు. ఒకవేళ ఇతర రిటైర్ మెంట్ ప్లాన్ల వైపు వెళితే అధిక రాబడులు వచ్చే అవకాశం అధిక రిస్కులతోనే కూడి ఉంటుందని పేర్కొన్నారు. ఆ వయసులో అధిక రిస్క్ పెట్టుబడులు వైపు వెళ్లడం మంచిది కాదని చెప్పారు.
పన్ను ప్రయోజనం ఉందిగా..
ఇక రెండో ఇంటిని కొనుగోలు చేయడం అదనపు పన్ను ప్రయోజనాలతో వస్తుంది. రెండో ఇంటిపై పెట్టుబడికి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి, సెక్షన్ 10 (10ఏ) కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పదవీ విరమణ చేసినవారి ఇతర పెట్టుబడులు కూడా ఈ సెక్షన్ల పరిధిలోకి వస్తాయి. అయితే, ఇంటిని కొనుగోలు చేయడం వల్ల 80సి ప్రయోజనాలతోపాటు గృహ రుణంపై చెల్లించే వడ్డీకి కూడా సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపులు ఉంటాయి. ‘వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రెండో ఇల్లు చాలా ఘనమైన ఆస్తిగా ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం స్థాయిలతో అద్దె ఆదాయం, ఆస్తి విలువ కూడా పెరుగుతూ అత్యవసర పరిస్థితుల్లో బాగా అక్కరకొస్తాయి.
కొన్ని రిటైర్మెంట్ ప్రణాళికలు పెద్ద మొత్తాన్ని అందజేసే అవకాశం ఉన్నప్పటికీ, రెండో ఇల్లు ఇంకా బలమైన ఆస్తిగా ఉంటుంది. అవసరమైతే ఆ ఇంటిని విక్రయించే అవకాశం కూడా ఉంటుంది’ అని నిపుణులు అంటున్నారు. పదవీ విరమణకు కనీసం 10 నుంచి 15 ఏళ్ల ముందు రెండో ఇంటి కొనుగోలుకు ప్రయత్నించాలని సూచించారు. తద్వారా ఈఎంఐలు సౌకర్యవంతంగా చెల్లించొచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ నుంచి సహాయం తీసుకోవడం కూడా మంచిదని చెప్పారు.