ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ.. ఏషియా పసిఫిక్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పీఏజీలు కలిసి.. 91 అంతస్తుల సూపర్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణంలోకి అడుగుపెట్టాయి. లోకాండ్‌వాలా కటారియా కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణాన్ని 2010లో ఆరంభించింది. ఈ సంస్థే ప్రాజెక్టును నిర్మిస్తుంది. సకాలంలో అనుమతులు రాకపోవడం.. తర్వాత కొవిడ్ వంటి అంశాల కారణంగా సకాలంలో పూర్తి కాలేదు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన.. బ్రాండింగ్, సేల్స్ మరియు మార్కెటింగ్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. మినర్వా పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు ముంబై మహాలక్ష్మీ ప్రాంతంలో నిర్మాణం జరుగుతోంది. దీనికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రాజెక్టు ఫండింగ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా షోపూర్జీ పల్లోంజీ సంస్థ అల్ట్రా లగ్జరీ సెగ్మంట్‌లోకి అడుగుపెట్టింది.
91 అంతస్తుల ఆకాశహర్మ్యం
300 మీటర్ల ఎత్తు గల ఈ ప్రాజెక్టు నుంచి మహాలక్ష్మీ రేస్ కోర్సు, ఆరేబియా సముద్రం కనిపిస్తుంది. 12 లక్షల చదరపు అడుగుల నిర్మాణం గల ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.1500 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని సంస్థ అంచనా వేస్తోంది. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య 372 కాగా.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఫ్లాట్లను కొనుగోలు చేశారని సమాచారం. ఇందులో 51వ ఫ్లోరు దాకా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లభించింది. దాదాపు 200 మంది కొనుగోలుదారులు గృహప్రవేశం చేస్తారని తెలిసింది.