Categories: TOP STORIES

తెలంగాణలో కావాలి ఇలాంటి రియ‌ల్ కోర్సులు!

  • అహ్మాదాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభం
  • క్రెడాయ్ అహ్మదాబాద్ తో కలిసి ప్రారంభించిన శివాలిక్ గ్రూప్
  • పరిశ్రమకు కొత్త టాలెంట్ తీసుకురావడమే లక్ష్యం

రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతులు కావడానికి ప్రత్యేకంగా శిక్షణ సంస్థలు, కోర్సులు అనేవి ఏవీ లేవు. ఇప్పటికే ఈ రంగంలో అనుభవం ఉన్నవారి నుంచి కొంచెం కొంచెం తెలుసుకుంటూ క్రమంగా నేర్చుకునేవారే అందరూ. ఇకపై ఇలాంటి అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ శిక్షణ ఇచ్చేందుకు కొత్తగా ఇన్ స్టిట్యూట్ ప్రారంభమైంది. క్రెడాయ్ అహ్మదాబాద్ తో కలిసి శివాలిక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ శిక్షణ సంస్థను శివాలిక్ గ్రూప్ ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అనుభవంతో కూడిన బోధనను ఇందులో అందిస్తారు. తద్వారా ఈ పరిశ్రమకు కొత్త టాలెంట్ అందిస్తారు. శివాలిక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ (ఎస్ఐఆర్ఈ)లో ప్రస్తుతం ‘జర్నీ ఆఫ్ రియల్ ఎస్టేట్’ పేరుతో 42 రోజుల సర్టిఫికెట్ కోర్సు అందిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కీలకాంశాలన్నింటినీ ఇందులో పొందుపరిచారు. అహ్మదాబాద్ లో ఏర్పాటైన ఈ సంస్థకు క్రెడాయ్ అహ్మదాబాద్ జీఐహెచ్ఈడీ తన మద్దతు అందిస్తోంది.

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లో కీలకమైన మార్పులు తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామని ఎస్ఐఈర్ఈ పేర్కొంది. రియల్ రంగంపై మక్కువ ఉన్నవారిని ఇందులో మరింత సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. ఈ రంగంలో పూర్తి నిష్ణాతులుగా మారేలా శక్తివంచన లేని కృషి చేస్తామని తెలిపింది. శివాలిక్ గ్రూప్ గత 25 ఏళ్లుగా ఈ రంగంలో ఉందని.. ఈ నేపథ్యంలో తమ అనుభవాన్ని, విజ్ఞానాన్ని సమాజానికి, ఈ పరిశ్రమకు తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని భావించి ఎస్ఐఆర్ఈ స్థాపించామని వివరించింది.

 

ఇదీ కోర్సు మాడ్యూల్..

  • రియల్ ఎస్టేట్ పరిచయం. దీని ద్వారా రియల్ రంగంపై పూర్తి అవగాహన వస్తుంది.
  • ఎంట్రపెన్యూర్ షిప్ అండ్ ప్రాజెక్టు సాధ్యత. దీని ద్వారా విద్యార్థికి ఎంట్రపెన్యూర్ షిప్ ఆలోచనా ధోరణ రావడమే కాకుండా ఇందుకు అవసరమైన నైపుణ్యం సంపాదిస్తారు. అలాగే ప్రాజెక్టు సాధ్యత ఎంతవరకు అనే అంశంలోనూ చక్కని అంచనా వేయగలుగుతారు.
  • ల్యాండ్, రెవెన్యూ, జీడీసీఆర్ ప్రమాణాలు. ఇందులో ల్యాండ్ డెవలప్ మెంట్ నిబంధనలు తదితరాలపై పూర్తి అవగాహన వస్తుంది.
  • ప్రాజెక్టు ప్లానింగ్. దీని ద్వారా లేఔట్ ప్లాన్లు, సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చే నైపుణ్యం సంపాదిస్తారు.
  • రెరాకు సంబంధించి పూర్తి అవగాహన ఈ మాడ్యూల్ ద్వారా వస్తుంది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే లాభాలు, వివిధ స్టేక్ హోల్డర్ల పాత్ర ఏమిటనేది తెలుసుకోవచ్చు.
  • నిర్మాణ నిర్వహణ. ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించాల్సిన సాంకేతికత, ఇతర వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు.
  • ఫైనాన్స్, ట్యాక్సులు, నగదు ప్రవాహం. ఈ రంగానికి సంబంధించి ఆర్థిక వనరులతోపాటు ఆర్థిక నిర్మాణ ఎలా అనే అంశాలు ఇక్కడ తెలుస్తాయి. టాక్సులకు సంబంధించిన అంశాలపై కూడా అవగాహన వస్తుంది.
  • సేల్స్ అండ్ మార్కెటింగ్. రియల్ రంగంలో మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత, వ్యూహాలు, ప్లానింగ్, బడ్జెట్ కేటాయింపులు, మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేసే తీరు వంటివన్నీ ఈ మాడ్యూల్ లో కవర్ అవుతాయి.
  • లీగల్ అండ్ డాక్యుమెంటేషన్. ఒక ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ ఎలాంటి అనుమతులు కావాలి? వాటికి అనుసరించాల్సిన విధివిధానాలేమిటి అనే అంశాలను ఈ మాడ్యూల్ లో వివరిస్తారు.
  • మానవ వనరులు. మానవ వనరుల పాత్ర, దీని అభివృద్దికి అనుసరించాలని విధానాలను ఈ మాడ్యూల్ లో తెలుసుకోవచ్చు.
  • అప్పగింత, బీయూ. భవన వినియోగ అనుమతి (బీయూ), ప్రాజెక్టు డెలివరీ (అప్పగింత) కి సంబంధించిన ప్రక్రియను ఈ మాడ్యూల్ లో నేర్పిస్తారు.

ఈ కోర్సుకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • కన్సల్టెంట్లు, సేల్స్ చానల్ భాగస్వాములు, డెవలపర్లు
  • సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్లు, ఆర్ట్స్ అండ్ కామర్స్ విద్యార్థులు
  • విద్యార్థులు, డిజైనర్లు, కన్సల్టెంట్లు, నిర్మాణ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్
  • ఆర్కిటెక్టులు, అడ్వొకేట్లు, సీఏ
  • రియల్ ఎస్టేట్, నిర్మాణ నిపుణులు
  • రియల్ ఎస్టేట్ కెరీర్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ.

నిపుణులను త‌యారు చేస్తాం

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లో కీలకమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. రియల్ రంగంపై మక్కువ ఉన్నవారిని ఇందులో మరింత సుశిక్షితులుగా తీర్చిదిద్దుతాం. ఈ రంగంలో పూర్తి నిష్ణాతులుగా మారేలా శక్తివంచన లేని కృషి చేస్తాం. శివాలిక్ గ్రూప్ గత 25 ఏళ్లుగా ఈ రంగంలో ఉంది.. ఈ నేపథ్యంలో తమ అనుభవాన్ని, విజ్ఞానాన్ని సమాజానికి, ఈ పరిశ్రమకు తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని భావించి ఎస్ఐఆర్ఈ స్థాపించాం. సరికొత్త భారతాన్ని నిర్మించడమే తమ ధ్యేయం. ప్రపంచస్థాయి ప్రమాణాలు, పరికరాలతో తమ విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది రియల్ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న నైపుణ్య లేమిని పూడుస్తాం. ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ బోధనను క్రెడాయ్ అహ్మదాబాద్, ఇతర విశ్వసనీయ పెద్ద సంస్థల సహకారంతో అందిస్తాం. పరిశ్రమ నిపుణులతో సంప్రదింపులు, కేస్ స్టడీలు, సైట్ విజిట్స్, రోల్ ప్లే వంటి అంశాలతో తమ బోధన కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం కోసం చిన్న చిన్న బ్యాచ్ లకు శిక్షణ ఉంటుంది. పరిశ్రమ నిపుణుల బోధన, గెస్ట్ లెక్చర్లు, 11 మాడ్యూల్స్, రియల్ ఎస్టేట్ కు సంబంధించి సమగ్ర వివరాలు ఇందులో ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత నిపుణుల నుంచి సూచనలు, సలహాలు పొందే వెసులుబాటు ఉంటుంది. – చిత్రాక్ షా, ఎండీ, శివాలిక్ గ్రూప్‌

This website uses cookies.