హైదరాబాద్లో కొందరు ఏజెంట్లు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. రెరా అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ప్రకటనల్ని విడుదల చేయకూడదని తెలంగాణ రెరా అథారిటీ ఎంత మొత్తుకుంటున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు పేరు చెప్పకుండా ఇలా తెలివిగా ప్రకటనల్ని గుప్పిస్తున్నారు. అత్తాపూర్లో ఎత్తయిన టవర్ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 3, 4 బెడ్రూమ్ ప్రాజెక్టు వస్తోందని..
ధర రూ.1.16 కోట్ల నుంచి ఆరంభమని ప్రకటించారు. పైగా, ప్రాజెక్టును ఓ ప్రముఖ సంస్థ నిర్మిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి రాక ముందే ఇలా ప్రచారం చేసే సంస్థలపై తెలంగాణ రెరా అథారిటీ వెంటనే కొరడా ఝళిపించాలి. లేకపోతే, ఇలాంటి వాటిలో కొనుగోలు చేసి.. రేపు ప్రాజెక్టు ప్రారంభం కాకపోతే.. కొనుగోలుదారులు దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి, వీటిని అరికట్టాల్సిన బాధ్యత తెలంగాణ రెరా అథారిటీపై ఉంది.