Categories: TOP STORIES

సిద్ధిక్ న‌గ‌ర్ వంటి సిత్రాల్ని.. సీఎం నియంత్రించాల్సిందే!

గ‌చ్చిబౌలి సిద్ధిక్ న‌గ‌ర్‌లో 50 గ‌జాల్లో ఐదు అంత‌స్తుల భ‌వ‌నం ఒక‌వైపు కుంగిపోయింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై ఆయా ఇంటిని నేల‌మ‌ట్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, హైద‌రాబాద్‌లోని ప‌లు కాల‌నీల్లో ఇలాంటి అక్ర‌మ నిర్మాణాల సంఖ్య ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా, ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని అనేక కాల‌నీలు, బ‌స్తీల్లో ఇలాంటి క‌ట్ట‌డాలకు లెక్కే లేదు.

స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి తెలియ‌కుండా ఇలాంటి నిర్మాణాలు జ‌రిగే ప్ర‌స‌క్తే లేదు. అంతేకాదు, స్థానిక కార్పొరేట‌ర్ల‌తో పాటు వారికి సంబంధించిన అనుచ‌రులే.. అక్ర‌మ క‌ట్ట‌డాల్ని క‌ట్టేందుకు ప‌రోక్షంగా సాయం చేస్తుంటార‌నే విష‌యం తెలిసిందే. మ‌రి, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా క‌ట్టే నిర్మాణాల్ని ప్ర‌భుత్వం ఎలా నియంత్రిస్తుంది?

అక్ర‌మ నిర్మాణాల్ని క‌ట్టొద్దు.. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ఇళ్ల‌ను క‌ట్టుకోవాలని గ‌తంలో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అనేక సంద‌ర్భాల్లో సూచించారు. వీటిని నియంత్రించే బాధ్య‌త జిల్లా క‌లెక్ట‌ర్‌కు అప్ప‌ట్లో అప్ప‌గించారు. ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేశారు. ఎవ‌రైనా అక్ర‌మ నిర్మాణాల‌కు సంబంధించిన స‌మాచార‌మిస్తే బ‌హుమ‌తి కూడా అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇప్ప‌టివ‌ర‌కూ పుర‌పాల‌క శాఖ‌కు ప్ర‌త్యేకంగా ఒక మంత్రి అంటూ లేరు.

ఈ శాఖ సీఎం ఆధ్వ‌ర్యంలోనే ఉండ‌టంతో త‌ను పూర్తి స్థాయిలో పుర‌పాల‌క శాఖ‌పై దృష్టి పెట్టే తీరిక ఉండ‌దు. కాబ‌ట్టి, సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికైనా, ఇలాంటి అక్ర‌మ క‌ట్ట‌డాల్ని నిరోధించేందుకు ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టాలి. ఇందుకోసం ఒక టాస్క్‌ఫోర్స్ క‌మిటీని ఏర్పాటు చేసి.. ఇక నుంచి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా భ‌వ‌నాల్ని క‌ట్ట‌కుండా పూర్తి స్థాయిలో నియంత్రించాలి.

This website uses cookies.