హైదరాబాద్‌లో లేఅవుట్లను అభివృద్ధి చేసే సంస్థలో సువర్ణభూమికి ప్రత్యేక పేరును సంపాదించింది. ఈ సంస్థ మొదటి నుంచి కూడా సినిమా తారలతో బ్రాండింగ్ చేయిస్తూ.. ప్లాట్ల కొనుగోలుదారులకు దగ్గరైంది. తరతరాలకు చెరగని చిరునామా అంటూ బయ్యర్లను విశేషంగా ఆకర్షించింది. అయితే, ఈ కంపెనీ కూడా తాజాగా మోసపూరిత సంస్థల జాబితాలో చేరింది. బై బ్యాక్ స్కీముతో తమను మోసం చేశారంటూ కొందరు బయ్యర్లు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.
మూడేళ్ల క్రితం తాము పెట్టుబడి పెట్టామని.. కానీ, ఇంతవరకూ తమకు సొమ్ము ఇవ్వకుండా తిప్పిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వద్దు కనీసం అసలిచ్చినా చాలని ప్రాధేయపడుతున్నారు. అయితే, తాము ఎలాంటి మోసం చేయలేదని.. బయ్యర్లకు ప్లాట్లను రాసిచ్చామని.. వాటిని అమ్ముదామంటే మార్కెట్ ప్రతికూలంగా ఉందని సంస్థ ఎండీ శ్రీధర్ విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బై బ్యాక్ స్కీమ్ అనేది రెరా నిబంధనలకు విరుద్ధం. ప్లాట్లలో పెట్టుబడి పెడితే మూడేళ్ల తర్వాత మళ్లీ తామే కొంటామని సువర్ణభూమి సంస్థ చెప్పడం సహేతుకం కాదు. పైగా, స్థలాన్ని రిజిస్టర్ చేశామని, ఎంవోయూ కుదుర్చుకున్నామని సంస్థ ఎండీ శ్రీధర్ చెప్పడం.. తాను చేసిన తప్పును ఒప్పుకోవడమే. ఎందుకంటే, రెరా నిబంధనకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించాడు.
పైగా, మార్కెట్ మెరుగ్గా లేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం కరెక్టు కాదు. మరి, ఈ వ్యవహారంలోకి టీజీ రెరా అడుగుపెట్టి.. సమస్యను పరిష్కరించాలి. బయ్యర్లకు న్యాయం చేయాలి. సువర్ణభూమిపై జరిమానా విధించాలి. అప్పుడే ఏ రియల్టర్ ఇలాంటి తప్పుడు విధానాల్ని అనుసరించడు. అలా కాకుండా టీజీ రెరా అధికారులు, ప్రభుత్వ పెద్దలు.. ఈ సంస్థ వద్ద ఆమ్యామ్యాలు తీసుకుని చర్యల్ని తీసుకోకుండా వదిలేస్తే.. ఇలాంటి మోసాలే పునరావృతమయ్యే అవకాశముంది.
This website uses cookies.