Categories: TOP STORIES

భారత్ లోకి మరో ఆరు ట్రంప్ టవర్లు

  • ట్రిబెకా డెవలపర్స్ తో ట్రంప్ ఆర్గనైజేషన్ చర్చలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ మరో ఆరు అల్ట్రా లగ్జరీ టవర్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం గుర్గావ్ కు చెందిన ట్రిబెకా డెవలపర్స్ తో ట్రంప్ సంస్థ చర్చలు జరుపుతోంది. 2023 లోపు కనీసం రెండు ప్రాజెక్టులైనా ప్రారంభించాలని ట్రంప్ సంస్థ యోచిస్తోంది. ఇందుకోసం ట్రంప్ కుమారుడు, ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్రిబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో అమెరికా వెలుపల తమకు ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని చెప్పారు. ట్రిబెకాతో తమ భాగస్వామ్యం బాగుందని పేర్కొన్నారు. కల్పేష్ ఆధ్వర్యంలోని ట్రిబెకా.. గత ప్రాజెక్టులను సాకారం చేయడంలో సహాయకారిగా ఉందని తెలిపారు. ట్రంప్ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

వాస్తవానికి ట్రంప్ ఆర్గనైజేషన్ అమెరికాలో కాకుండా ఈ ప్రాజెక్టుల్లో నేరుగా పెట్టుబడి పెట్టదు. భారతదేశంలో ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీలను డెలివరీ చేసే బాధ్యత ట్రిబెకాదే. ట్రంప్ సంస్థ తన నైపుణ్యాలను ట్రిబెకాకు అందజేస్తుంది. పుణె, ఢిల్లీలోని ట్రంప్ టవర్లను ట్రిబెకా సంస్థే చేపట్టింది. ప్రస్తుతం ట్రంప్ బ్రాండ్ కింద ఆరు కొత్త ఒప్పందాలు తుది దశలో ఉన్నాయని.. అందులో వచ్చే 12 నెలల్లో 3 నుంచి 5 ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ట్రిబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు. రాబోయే ట్రంప్ ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్ అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్లు కాకుండా రెండు వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి పుణెలో వచ్చే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, లూథియానా, చండీగఢ్ వంటి నగరాల్లో మిగిలిన ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది.

This website uses cookies.