అపార్టుమెంట్ నిర్వహణ అంటే బ్రహ్మవిద్య అనుకుంటారు. గ్రీకు, ల్యాటిన్ భాష నేర్చుకున్నంత కష్టమని భావిస్తారు. తమ సమయాన్ని వృథా చేయడమెందుకని కొందరు.. ఎంత చేసినా, ఏదో ఒక మాట పడాల్సి వస్తుందని మరికొందరు భావించి వెనకడుగు వేస్తారు. అసలా రొచ్చులోకి ఎందుకెళ్లడం బాబోయ్ అని అంటుంటారు ఇంకొందరు. ఎందుకంటే, అపార్టుమెంట్ నిర్వహణను చేయడమంటే మాటలు కాదు.. మెరుగైన సేవల్ని అందించడానికి రాత్రింబవళ్లు కష్టపడినా.. ఏదో రకంగా రాళ్లేసేవారు కొందరుంటారు. మరికొందరేమో ముందొక రకంగా మాట్లాడతారు.. వెనకా వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుకే, అపార్టుమెంట్ నిర్వహణ సంఘంలోకి అడుగుపెట్టడానికి అనేకమంది జంకుతుంటారు. కొంతమంది ధైర్యంగా సంఘంలోకి ప్రవేశించినా, సంఘానికి ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవడంలో విఫలం అవుతుంటారు. కానీ, మియాపూర్‌లోని ఎస్ ఎం ఆర్ వినయ్ సిటీ నిర్మాణ సంఘం.. గత నాలుగేళ్లలో ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. సుమారు నాలుగేళ్లుగా నయాపైసా నెలసరి మెయింటనెన్స్ పెంచకుండా విజయవంతంగా సంఘాన్ని నిర్వహిస్తోంది. అలా అనీ అభివృద్ధి కార్యక్రమాల్ని ఎక్కడా ఆపలేదు. ఉద్యోగులు, సిబ్బందికి క్రమం తప్పకుండా జీతాల్ని పెంచింది. మరి, ఈ సంఘం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించింది?
మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ నిర్మించింది. జీవో నెం. 86 రాక ముందు కంటే అనుమతి తీసుకున్న నిర్మాణమిది. 2011లో బిల్డర్ హ్యాండోవర్ చేశాక.. పలు సంఘాలు నిర్వహణను మెరుగ్గా నిర్వహించాయి. కాకపోతే, నాలుగేళ్ల క్రితం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన స్కోవా-7 సంఘం చేసిన మొట్టమొదటి పని.. అనవసర, వృథా ఖర్చుల్ని పూర్తిగా నియంత్రించింది. కొత్త సంఘానికి చెందిన అధ్యక్షుడితో పాటు పలువురు కీలక సభ్యులు ఒక బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టింది.
అపార్టుమెంట్ నిర్వహణ అంటే మాటలు కాదు.. ఇందుకు సంబంధించి అనేక విభాగాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉదాహరణకు హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, రోజు వారీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు.. ఇలా ప్రతి పనిని ఒకరిద్దరు సంఘ సభ్యులకు అప్పగించారు. దీంతో అపార్టుమెంట్ నిర్వహణ కొంత సులువుగా మారింది. అయితే, ప్రతిఒక్క సంఘ సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్లే.. ఎక్కడా ఎలాంటి ఆటంకం రాకుండా పనులన్నీ సజావుగా సాగేవి.
ఆతర్వాత ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని నెలకొల్పింది. ఈ అపార్టుమెంట్‌లో 12 అంతస్తులవి నాలుగు బ్లాకులు, నాలుగు అంతస్తుల్లో ఒక బ్లాకు ఉంది. ఒక్కో బ్లాకులో రెసిడెంట్స్ ఎదుర్కొనే సమస్యలకు వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసి.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా.. అందులో తెలియజేస్తే.. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ వాళ్లు తక్షణమే దృష్టి సారించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇలా కేవలం వాట్సప్పుల ద్వారా అధిక సమస్యలు పరిష్కారమయ్యేలా చేశారు. క్లిష్టమైన సమస్యలకు అప్నా కాంప్లెక్స్‌లో నమోదు చేస్తే.. పరిష్కారం అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
కేవలం నెలసరి నిర్వహణ రుసుముల మీదే ఆధారపడలేదీ సంఘం. ఇతర వ్యాపార ప్రకటనలు, ఎల్ఈడీ బోర్డులు, ఎగ్జిబిషన్లు వంటివి క్రమం తప్పకుండా ఏర్పాటు చేయించింది. క్లబ్‌హౌజ్ మొత్తం అందంగా రీ-డిజైన్ చేయించి.. గెస్ట్ రూముల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చేసింది.
దేశ, విదేశాల్లో నివసించే ఓనర్ల కోసం ప్రత్యేకంగా రెంటల్ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. కొత్తగా ఫ్లాట్ల అమ్మకాల సేవల్ని ఆరంభించింది. ఇందుకోసం కొత్త సిబ్బందిని నియమించకుండా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవారినే వినియోగించింది. దీని వల్ల నిర్వహణ సంఘానికి క్రమం తప్పకుండా ఆదాయం రావడం ఆరంభమైంది.
అపార్టుమెంట్‌లో చిన్న, పెద్దా అనే తేడా లేకుండా.. అందరి కోసం ఏడాదికోసారి ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఎక్స్‌ట్రావగాంజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదికోసారి సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 75 శాతం కంటే అధిక మంది నివాసితులు ఉత్సాహంగా పాల్గొనేవారు. దీని ద్వారా ఒకరికొకరు పరిచయం అవ్వడం, ఫ్రెండ్‌షిప్ పెరగడం అధికమైంది.
ఏడాది పొడవునా సుమారు 80 రోజులకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే గేటెడ్ కమ్యూనిటీ.. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. వినాయక చవితి, దసరా, మహా శివరాత్రి, ఉగాది, శ్రీరామ నవమి, క్రిస్మస్ వంటి పండుగలు ఘనంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక ఈవెంట్లను అత్యంత వైభవంగా జరుగుతాయి. రెండు రోజుల క్రితమే రాజస్థాన్‌లోని గంగోర్ ఉత్సవాన్ని పలువురు రాజస్థానీ, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సాహపూరితమైన సాంస్కృతిక వాతావరణం నెలకొనడం వల్ల భిన్నత్వంలో ఏకత్వంగా నివాసితుల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగడం అలవర్చుకున్నారు.
ఉన్నతమైన ఆలోచనలుంటేనే..
గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బ్రహ్మ పదార్థమేమీ కాదు. కాస్త ప్రణాళికాబద్ధంగా ఆలోచించి.. వాస్తవికంగా పరిస్థితుల్ని అధ్యయనం చేసి.. ఒక పద్ధతి ప్రకారం సిబ్బందిని వినియోగిస్తే.. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే, ఇలా చేయాలంటే ఓపిక అవసరం. ప్రతి కమ్యూనిటీలో ఏ మంచి పని చేసినా కనీసం ఐదు శాతం మంది అయితే భూతద్ధంలో పెట్టి చూస్తారు. ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటారు. అవసరమైతే వాళ్లతో కూడా మాట్లాడాలి. లేదా వారిని పెద్దగా పట్టించుకోకుండా.. మిగతా 95 శాతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాలి. సొసైటీని డెవలప్ చేయాలనే ఉన్నతమైన ఆలోచనలున్న వ్యక్తులున్న కమ్యూనిటీ.. ఎప్పుడూ ఉల్లాసభరితంగా ఉంటుంది.