Categories: LATEST UPDATES

గోద్రెజ్‌ కు రెరా షాక్

నిబంధనలు పాటించకపోవడంతో
రిజిస్ట్రేషన్ దరఖాస్తు తిరస్కరణ

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ గోద్రేజ్ డెవలపర్స్ అండ్ ప్రాపర్టీస్ కి రెరా షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించలేదనే కారణంతో రిజిస్ట్రేషన్ పొడిగింపు కోసం ఆ కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును హర్యానా రెరా తిరస్కరించింది. పలుమార్లు రిమైండర్లు ఇచ్చినప్పటికీ, దరఖాస్తులోని లోపాలను సరిదిద్దడంలో విఫలమయ్యారని, ప్రాజెక్టు త్రైమాసిక పురోగతి నివేదికలో పేర్కొన్న వివరాలు ఏవీ సరిపోవడంలేదని రెరా పేర్కొంది. లైసెన్స్ పునరుద్ధరణతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ కు సంబంధించిన లోపాలు కూడా ఉన్నాయని తెలిపింది. గోద్రేజ్ సంస్థ గురుగ్రామ్ లోని సెక్టార్ 85లో గోద్రేజ్ ఎయిర్ ఫేజ్ 4 పేరుతో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం 2018లో రెరా రిజిస్ట్రేషన్ పొందింది. ఇది 2023 జూన్ వరకు చెల్లుబాటు అవుతుంది. అంటే ఆలోగా ప్రమోటర్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి. అయితే, నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో రిజిస్ట్రేషన్ పొడిగించాలని కోరుతూ గోద్రేజ్ సంస్థ రెరాను అభ్యర్థించింది. అయితే, ఆ దరఖాస్తు పరిశీలించిన రెరా.. అందులో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని ప్రమోటర్ కు సూచించింది.

ఇందుకోసం తగినంత సమయం కూడా ఇచ్చింది. కానీ సంస్థ నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో దరఖాస్తు తిరస్కరణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో రెరా తుది షోకాజ్ నోటీసు కూడా పంపించింది. అయినప్పటికీ ప్రమోటర్ నుంచి స్పందన లేకపోవడంతో దరఖాస్తు తిరస్కరిస్తూ రెరా నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాజెక్టు బ్యాంకు ఖాతాను కూడా స్తంభింపజేసింది. ఆ ప్రాజెక్టులో ఎలాంటి బుకింగులు చేసుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గోద్రేజ్ డెవలపర్స్ అండ్ ప్రాపర్టీస్ స్పందించింది. తాము రెరా లేవనెత్తిన ప్రశ్నలకు నిరంతరం సమాధానం ఇస్తున్నామని, సంబంధిత పత్రాలను సమర్పిస్తున్నామని పేర్కొంది. దరఖాస్తు తిరస్కరిస్తూ తీసుకున్న ఉత్తర్వులను పక్కన పెట్టమని అభ్యర్థిస్తూ రెరాకు లేఖ సమర్పించే పనిలో ఉన్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

This website uses cookies.