Categories: EXCLUSIVE INTERVIEWS

రెండేళ్లలో మార్కెట్ వృద్ధి

  • రియల్ ఎస్టేట్ లో డిమాండ్ ఎప్పటికీ తగ్గదు
  • సొంతింటి కల సాకారానికి సమయమిదే
  • అందుబాటు గృహాలకు డిమాండ్ ఎక్కువ
  • న‌రెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్‌

రానున్న రోజుల్లో రియల్ రంగం జోరుగా దూసుకెళ్లడం ఖాయమని, వ్యవస్థీకృతంగా కీలకంగా ఉన్నవారంతా మార్కెట్ లో పెద్ద వాటా పొందడం మనం చూస్తామని న‌రెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ తెలిపారు. రియల్ ఎస్టేట్ లో డిమాండ్ ఎప్పటికీ తగ్గిపోదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితే అందుకు నిదర్శనమని చెప్పారు. ‘రెండు లేదా మూడు కారణాలతో డిమాండ్ మళ్లీ వెనక్కి వచ్చింది. ప్రస్తుతం చాలా అనుకూలమైన వాతావరణం ఉండటం ఇందులో ఒకటి. ముఖ్యంగా వడ్డీరేట్లు చాలాకాలం నుంచి అత్యల్పంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక వ్యవస్థను వృద్ధి మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నందున.. ఇదే పరిస్థితి మరో రెండేళ్లపాటు స్థిరంగా కొనసాగుతుంది. ఇక సొంతిల్లు ఉండటం ఎంత ముఖ్యమో జనానికి అర్థం కావడం రెండో కారణం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు సొంతింటి దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో కొనుగోలుదారుల స్తోమత పెరిగింది. మరోవైపు డెవలపర్లు కూడా నిధులు, ఫైనాన్స్ విషయంలో వినియోగదారులకు చక్కని పరిష్కారాలు చూపెడుతున్నారు. దీంతో కొనుగోళ్లకు ఇది తగిన సమయంగా మారింది. ఈ కారణాలతోనే డిమాండ్ తిరిగి రావడం మనం చూస్తున్నాం’ అని ప్రేమ్ కుమార్‌ వివరించారు.

డిమాండ్ అనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని, ఏకీకరణపరంగా మాత్రమే సవాల్ ఎదురవుతుందని, ప్రస్తుతం మనం అదే చూస్తున్నామని ఆయ‌న‌ పేర్కొన్నారు.  రెసిడెన్షియల్ తోపాటు అభివృద్ధి చేసిన ప్లాట్లు చక్కని వేగంతో దూసుకెళ్లడం కొనసాగుతుంది. ఈ పరిస్థితి పెద్ద, వ్యవస్థీకృతంగా కీలకంగా ఉన్న వారి వ్యాపారం మరింత పెరగడానికి దోహడపడుతుంది. అలాగే వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రజలు ఆఫీసులకు రావడం ఇప్పటికే ప్రారంభమైంది. ఇక వ్యాక్సినేషన్ కూడా ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వాణిజ్యపరమైన మార్కెట్ తిరిగి పుంజుకోవడంతో ఆ మేరకు డిమాండ్ పెరగడాన్ని కూడా మనం చూస్తాం’ అని ప్రేమ్ కుమార్ వివరించారు. మొత్తమ్మీద రాబోయే రెండేళ్లలో మార్కెట్ కచ్చితంగా వృద్ధి చెందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం తాము హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్నామని.. వీటికి మంచి డిమాండ్ ఉందన్నారు.

This website uses cookies.