Categories: TOP STORIES

ఏఎస్‌బీఎల్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేయండి

నిబంధనలకు విరుద్ధంగా పనులు!
సరైన డాక్యుమెంట్లు కూడా లేవు
పుప్పాలగూడలోని ఏఎస్బీఎల్
స్పెక్ట్రా ప్రాజెక్టులపై పీసీబీకి ఫిర్యాదు

నిబంధనలు పాటించకుండా, సరైన ప్రక్రియ అనుసరించకుండా గండిపేట ముండలం పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 315లో అశోకా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన ఏఎస్బీఎల్ స్పెక్ట్రా ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని పొరుగున ఉండే నవనామి రెసిడెన్సీ నివాసితులు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై శుక్రవారం పీసీబీలో జరిగిన విచారణకు పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ తో కలిసి వారు హాజరయ్యారు.

2021లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి సమ్మతి లేదని పేర్కొన్నారు. పైగా హెచ్ఎండీఏ అనుమతి లేఖ, ఈసీ, టీజీ రెరాల్లో దీనికి సంబంధించిన వివరాలు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉన్నాయన్నారు. సరైన ప్రొసీజర్ లేకుండా రాత్రీ పగలు చేస్తున్న పనుల వల్ల వాయు, ధ్వని కాలుష్యం ఎక్కువై తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. బిల్డర్ సీఎఫ్ఈ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల ఖజానాకు దాదాపు రూ.30 లక్షల వరకు నష్టం జరిగిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉస్మాన్ సాగర్ డ్రింకింగ్ వాటర్ రిజిర్వాయర్, హిమాయత్ సాగర్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ వంటి సున్నిత ప్రాంతాలతో పాటు మృగవని నేషనల్ పార్క్ కూడా ఉందని చెప్పారు.

మామసాని కుంట, దాని ఛానెళ్లు, మేకసాని కుంట, బల్కాపూర్ చానల్, బ్రాహ్మణ కుంట, పుప్పాలగూడలో ఉపరితల నీటి వనరులు, కాలువలు కూడా సమీపంలోనే ఉన్నాయన్నారు. శుద్ధిచేసిన అదనపు మరుగునీటిని పబ్లిక్ మురుగు కాల్వల్లోకి వదిలిపెడతారని.. రోజుకు ఉత్పత్తి అయ్యే 4080 కేజీల చెత్తను మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ సైట్ కు పంపిస్తారని పర్యావరణ అనుమతి(ఈసీ)లో పేర్కొన్నట్టు వివరించారు.

ఇక ఈసీలతోపాటు హెచ్ఎండీఏ, టీజీ రెరా అనుమతి పత్రాల్లో చాలా వరకు అసమానతలు ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం రూ.650 కోట్లుగా అనుమతి పత్రంలో ఉండగా.. టీజీ రెరా వెబ్ సైట్ లో రూ.1148 కోట్లుగా ఉందని చెప్పారు. 02-12-2020, 24-5-2021, 5-5-2021లో జారీ చేసిన మూడు ఈసీల్లో వేర్వేరు వివరాలు ఉన్నాయన్నారు. హెచ్ఎండీఏ, టీజీ రెరాల్లో వివరాలు కూడా వేర్వేరుగా ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు సరైన అనుమతులు, డాక్యుమెంట్లు లేనందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టును నిలిపివేయాలని, అలాగే అన్ని విక్రయాలూ ఆపేయాలని, దీని గురించి ప్రజలకు సక్రమంగా తెలియజేసి, సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలని వారు కోరారు.

This website uses cookies.