జనావాసాల్లో రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నిర్వహిస్తున్న ఫీనిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గండిపేట మండలం పుప్పాలగూడ లోని సర్వే నెంబర్లు 285 పార్ట్, 286 పార్ట్, 287 పార్ట్ లలో క్యాప్టివ్ రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నిర్వహిస్తోంది. అయితే దీనివల్ల పొరుగున ఉన్న నవనామి రెసిడెన్సీ వాసులు ధ్వని, వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్టు పీసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ ను మూసివేయాలని బోర్డు 2022 సెప్టెంబర్ 19న ఉత్తర్వులిచ్చింది.
అయితే, వాటిని ప్లాంటు యాజమాన్యం 2024 జూన్ 26న రద్దు చేయించుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈనెల 7, 14వ తేదీల్లో నవనామి రెసిడెన్సీ వాసులు పీసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు అధికారులు ప్లాంట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ప్లాంట్ కారణంగా అక్కడ కాలుష్యం ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలుష్యానికి కారణమవుతున్న మీ ప్లాంట్ ను ఎందుకు మూసివేయకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా వీటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు.
This website uses cookies.