Categories: TOP STORIES

బ్రేకింగ్.. సుహాస్ ప్రాజెక్ట్స్ వెబ్‌సైట్ తొల‌గింపు

ఆర్ఈజీ న్యూస్ ఎఫెక్ట్‌

ఆర్ఈజీ న్యూస్‌లో.. సుహాస్ ప్రాజెక్ట్స్‌.. 1500 కోట్ల స్కామ్‌? వార్త ప్ర‌చురితం కావ‌డంతో షాక్ తిన్న సుహాస్ ప్రాజెక్ట్స్ సంస్థ‌ త‌మ వెబ్‌సైటు (https://suhasprojects.com/management/)ను సాయంత్రం ఐదున్న‌ర‌ తర్వాత తొల‌గించింది. అంటే, రెజ్ న్యూస్ ప్రచురించిన వార్త నిజ‌మేన‌ని ఈ సంస్థ ప‌రోక్షంగా అంగీక‌రించిన‌ట్లేన‌ని న‌గ‌రానికి చెందిన రియ‌ల్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రెరా అనుమ‌తి లేకుండా ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అక్ర‌మ రీతిలో సొమ్ము వ‌సూలు చేయ‌క‌పోతే.. సంస్థ సైటును ఎందుకు తొల‌గిస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

సుహాస్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే వంద‌ల మంది నుంచి రూ.10 లక్షల చొప్పున పెట్టుబడుల్ని సేకరించిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల ద‌స్‌ప‌ల్లాలో సుమారు మూడు వంద‌ల‌కు పైగా రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ల‌తో నిర్వ‌హించిన ఈవెంట్ ద్వారా మ‌రిన్ని కోట్లు వ‌సూలు చేయాల‌ని స్కెచ్ వేసింది. హెచ్ఎండీఏ, రెరా అనుమ‌తి లేకుండా ఈ సంస్థ చేస్తున్న అడ్డ‌గోలు బాగోతం కొంద‌రు కొనుగోలుదారులు రెజ్ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, వాస్త‌వాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయగా.. హెచ్ఎండీఏ, రెరా అనుమ‌తి లేకుండా సుహాస్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ అక్ర‌మ దందా గురించి తెలిసింది.

బుధ‌వారం సాయంత్రం ప్ర‌చురిత‌మైన ఈ వార్త‌ను చూసి.. అనేక‌మంది రియ‌ల్ నిపుణులు రెజ్ న్యూస్‌ని అభినందించారు. రెరా ప‌ర్మిష‌న్ లేకుండా అక్ర‌మ వ‌సూళ్ల‌కు ఎగ‌బ‌డిన ఇలాంటి సంస్థ‌ల ఆగ‌డాల‌కు ఇక‌నైనా ప్ర‌భుత్వం అడ్డుక‌ట్ట వేయాల‌ని కోరారు. ”ఇప్ప‌టికే, హైద‌రాబాద్‌లో అనేకమంది అమాయ‌క మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ప‌లు రియ‌ల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబ‌డులు పెట్టి దారుణంగా మోస‌పోయారు. స‌కాలంలో సొంతింట్లోకి అడుగు పెట్ట‌క‌లేక‌పోవ‌డంతో.. అటు ఇంటి అద్దెలు క‌ట్టలేక‌.. తెచ్చిన అప్పుపై వ‌డ్డీ క‌ట్ట‌లేక మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నారు.

మ‌రి, అలాంటి బాధితుల జాబితాలోకి మ‌రికొంద‌రు ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే.. రెజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన ఈ వార్త వ‌ల్ల వంద‌లాది మందికి మేలు క‌లుగుతుంద‌ని ప్ర‌ముఖ రియ‌ల్ట‌ర్ ఎమ్మెస్ రాజు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లు కూడా నిజాయితీగా నిర్మాణాల్ని చేప‌ట్టేవారి వ‌ద్ద మాత్రమే కొనుగోలు చేయాల‌ని, నెల‌స‌రి అద్దెలు వ‌స్తాయ‌నే అత్యాశ‌తో.. రెరా అనుమ‌తి లేని ప్రాజెక్టుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌కూడ‌ద‌ని హితువు ప‌లికారు.

This website uses cookies.