శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరువలోని తుక్కుగూడలో.. భారీ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ థియేటర్.. ఆరు ఎకరాల్లో 15 లక్షల చదరపు అడుగుల్లో ట్విన్ టవర్లు.. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. 120 చదరపు అడుగుల స్థలం.. మూడు గజాల యూడీఎస్ స్థలం.. నెలకు ఐదు వేలు అద్దె.. ఇంకేముంది! మధ్యతరగతి ఆశలకు అతిపెద్ద గాలం..
మియాపూర్లో కోటి రూపాయల ఫ్లాట్.. యాభై లక్షలకే.. కాకపోతే ముందే సొమ్ము కట్టాలన్నది కండీషన్. పేరున్న నిర్మాణ సంస్థ.. మూడు, నాలుగేళ్ల కళ్లు మూసుకుంటే ఫ్లాట్ చేతికొస్తుందని భావించారు. సుమారు 250 మంది వంద శాతం సొమ్ము కట్టేశారు. అదిగో.. ఇదిగో.. అంటూనే మూడేళ్లుగా ఎదురు చూపే. ఫ్లాట్ ఎప్పుడొచ్చేనా అని!
ఫ్లాట్ రేటు తక్కువ.. ఎంచక్కా సొంతింట్లోకి గృహప్రవేశం చేస్తామని కొందరు కలలు కన్నారు. నెలనెలా అద్దె పక్కా.. అని ప్రకటన కనిపిస్తే చాలు.. అత్యాశపడి.. గొర్రెల్లా ఎగబడి చేతిలో ఉన్న సొమ్మంతా అక్రమార్కుల చేతిలో పోస్తున్నారు మరికొందరు. ఆ సంస్థకు అనుభవముందా? ఇప్పటివరకూ ఎన్ని కట్టారు? అని ఆలోచించట్లేదు. పోనీ.. వీరేమైనా నిరక్షరాస్యులా అంటే అదీ కాదు. అయినప్పటికీ రేటు తక్కువంటే ఆశపడుతున్నారు. కలల గృహం చేతికొస్తుందని కలలు కంటున్నారు. రెండు, మూడేళ్లయినా నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో చాలామంది మానసిక వేదనను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ, రియల్ రంగంలో కొత్త మోసగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో.. పొరుగు రాష్ట్రాలకు చెందిన మోసగాళ్లంతా వచ్చి హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. కార్పొరేట్ ఆఫీసు పెట్టి.. మంచి ఉద్యోగుల్ని నియమించుకుని.. ప్రకటనల్ని గుప్పిస్తూ.. అమాయకుల నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు. ఒక్కొక్కరి బాగోతం బయటపడటానికి ఎంతలేదన్నా కొంత సమయం పడుతుంది. కాకపోతే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
సుహాస్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. నిర్మాణ రంగంలో పెద్దగా అనుభవం లేదు. నిర్మాణాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై పరిజ్ఞానమూ లేదు. అయినప్పటికీ, మార్కెట్లో అందరూ చేస్తున్నట్లుగానే.. ఒక పెద్ద కమర్షియల్ స్కామ్‌కు తెర లేపింది. తుక్కుగూడలో ఆరు ఎకరాల్లో పదిహేను లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. షాపింగ్ మాల్, బిజినెస్ స్పేస్‌ను నిర్మిస్తామంటూ ప్రచారం ప్రారంభించింది. ఇందులో రూ.10 లక్షలు పెడితే చాలు.. 120 చదరపు అడుగుల స్థలం ఇస్తామని.. దానిపై ప్రతినెలా ఐదు వేలు అద్దె చెల్లిస్తామని ప్రకటించింది. ఇంతకీ ఆ స్థలం ఎవరిది? యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయి? అసలీ భూమి కోసం సుహాస్ ప్రాజెక్ట్స్ స్థలయజమానికి సొమ్ము చెల్లించిందా? లేక అడ్వాన్సు చెల్లించి.. మిగతా మొత్తాన్ని ఫ్రాడ్ స్కీమ్ పేరిట కొనుగోలుదారుల నుంచి వసూలు చేసి చెల్లించాలని స్కెచ్ వేసిందా? అనే విషయాలింకా తేలాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లుగా వెబ్‌సైటులో రాసుకుందీ సుహాస్ ప్రాజెక్ట్స్. అందుకు తగ్గట్టుగా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. తుక్కుగూడలోని బిజినెస్ స్పేస్ షాపింగ్ మాల్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటానని వెబ్‌సైటులో పొందుపర్చిన ఈ సంస్థ ఎండీ సుజాత సామినేనికి.. ప్రీలాంచుల్లో స్థలాన్ని విక్రయించకూడదన్న ఇంగితజ్ఞానం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేతిలో సొమ్ము లేకపోయినా.. హెచ్ఎండీఏ, రెరా అథారిటీల నుంచి అనుమతి తీసుకోకుండా.. పదిహేను లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అక్రమంగా అమ్మే ప్రయత్నం చేయడమెంత అన్యాయమనే విషయం తెలియదా అంటూ నిలదీస్తున్నారు. ఈ సంస్థ నిర్వాకం గురించి రెజ్ న్యూస్‌లో రాసిన కొంతసేపటికే వెబ్‌సైటును డిలీట్ చేసిన సుహాస్ ప్రాజెక్ట్స్.. మరుసటి రోజు మేనేజ్‌మెంట్ పేర్లు, ఫోటోలు లేకుండా సైటును ఆరంభించడం గమనార్హం.
This website uses cookies.