నగరానికి చెందిన వాసవి గ్రూప్, సుమధుర సంస్థలపై ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరుకు చెందిన సుమారు ఇరవై కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. దేశంలో అవినీతికి ముగింపు పలుకుతామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాతే ఈ దాడులు జరగడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాసవి గ్రూప్ నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసింది. సంస్థ ఎండీ ఎర్రం విజయ్ కుమార్ పక్కా ప్రణాళికలతో భారీ ప్రాజెక్టుల్ని చేపట్టారు. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సాయం లభించడం.. వివిధ ప్రాజెక్టుల్లో కొత్తగా భాగస్వామ్యుల్ని చేర్చుకోవడం వంటి అంశాల కారణంగా.. ఈ సంస్థ ప్రాజెక్టుల సంఖ్య పెరిగింది. అందుకే, నగరంలో ఏకకాలంలో ఇరవై ప్రాజెక్టుల్ని చేపట్టగలిగారు. వాసవి ఎంతలేదన్నా ఇరవై వేల ఫ్లాట్లను దాకా నిర్మిస్తోంది.
ఈ జాబితాలో కూకట్‌పల్లిలోని హిందూజాకు చెందిన ఐడీఎల్ భూమి, ఎల్‌బీ నగర్ సీరిస్ ఫ్యాక్టరీ వంటి స్థలాల్లో ఆరంభించిన నిర్మాణాలున్నాయి. ఐడీఎల్ భూమి పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించాల్సిన భూమి కాగా.. అందులో నివాస సముదాయాల్ని కట్టేందుకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ఇందులో ఓ మంత్రి పాత్ర ఉందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు.. పలు ప్రాంతాల్లో బడా ప్రాజెక్టుల ఆదాయ పన్ను రిటర్నులకు సంబంధించి తేడాలు ఉన్నందు వల్ల.. ఐటీ విభాగం సోదాలు నిర్వహించిందని తెలిసింది. అయితే, దీనిపై అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బెంగళూరుకు చెందిన సుమధుర సంస్థ వాసవి సంస్థతో కలిసి హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. తొలుత నానక్‌రాంగూడలో అక్రోపోలిస్ ప్రాజెక్టును ప్రారంభించింది. సొంతంగా కొండాపూర్‌లో హారిజాన్స్ నిర్మాణాన్ని ఆరంభించింది. వాసవితో కలిసి నానక్‌రాంగూడలో ద ఒలంపస్ అనే ఆకాశహర్య్మానికి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ రెరా అనుమతి రాకముందే శంషాబాద్‌లో ప్రీలాంచ్ అమ్మకాల్ని జరిపింది. అయితే, కేవలం వాసవితో కలిసి ప్రాజెక్టుల్ని చేపట్టడం వల్లే సుమధుర సంస్థపై ఐటీ సోదాలు జరిగి ఉండొచ్చని నిర్మాణ రంగం భావిస్తోంది.
This website uses cookies.