ఉత్సాహభరితం.. అంగరంగ వైభవం.. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు
వెలుగు జిలుగులతో గేటెడ్ కమ్యూనిటీలు
నగరానికి చెందిన పలు గేటెడ్ కమ్యూనిటీల్లో భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఉత్సాహభరితంగా జరిగాయి. దాదాపు వారం రోజుల ముందే పలు కమ్యూనిటీలు వెలుగు జిలుగులతో దర్శనమిచ్చాయి. మాదాపూర్‌లోని అరబిందో కొహినూర్, మియాపూర్‌లో క్యాండియర్ 40 వంటి ఆకాశహర్మ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ ద ఆనెక్స్, ఎస్ఎంఆర్ వినయ్ సిటీ వంటి కమ్యూనిటీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఖాజాగూడలోని జైన్స్ కార్ల్‌టన్ క్రీక్ రెసిడెంట్స్ ఫ్రీడమ్ వాక్‌తో పాటు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
మణికొండ చిత్రపురి కాలనీ, కొంపల్లిలోని నాగార్జున డ్రీమ్ ల్యాండ్, మంత్రి సెలస్టియా, ఎన్‌సీసీ అర్బన్ వన్, మై హోమ్ అవతార్ వంటి కమ్యూనిటీల్లో స్వాతంత్య్ర సంబరాలు ఘనంగా జరిగాయి. ఎస్‌సీఎస్‌సీ (సైబరాబాద్ సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్), హైదరాబాద్ సెక్లిస్ట్ గ్రూపుతో కలిసి కొంపల్లి నుంచి తూప్రాన్ దాకా ప్రత్యేకంగా సైకిలింగ్ ఈవెంట్‌ని నిర్వహించింది. సుమారు 75 కిలోమీటర్ల మేరకు జరిగిన ఈ ఈవెంట్‌లో దాదాపు 400-500 మంది పాల్గొన్నారు. సైకిళ్ల మీద జాతీయ జెండాను ఏర్పాటు చేసి ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, సైబరాబాద్ డీసీపీలు శిల్పవల్లి, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్‌సీఎస్‌సీ హైటెక్స్ కమాన్ వద్ద చేపట్టిన ఫ్రీడమ్ రన్ కూడా విజయవంతంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ఆగస్టు 16న ఉదయం 11.30 గం.లకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. గచ్చిబౌలిలో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాంధీ, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సొసైటీ (ఎస్‌సీఎస్‌సీ) సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల, వందలాది మంది ఐటీ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అంతకంటే ముందు, పలు గేటెడ్ కమ్యూనిటీల్లోని నివాసితులకు జాతీయ జెండాలను అందించడంలో ఎస్‌సీఎస్‌సీ ప్రత్యేక దృష్టి సారించింది. కమ్యూనిటీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర సంబరాలు ఘనంగా జరగడంలో ముఖ్యభూమిక పోషించింది.
ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో అంబరాన్నంటిన సంబరాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల పిలుపు మేరకు మొత్తం కమ్యూనిటీని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇందులో నివసించే వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ, ఫార్మా, పారిశ్రామికవేత్తలు తమ కుటుంబ సభ్యులతో సహా.. వెలుగుజిలుగుల బ్యాక్ గ్రౌండ్‌తో సెల్ఫీలు దిగి.. తమ బంధుమిత్రులకు షేర్ చేశారు. మరికొందరు సోషల్ మీడియాలో కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఫ్రీడమ్ వాక్‌లో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అధిక శాతం నివాసితులు పాల్గొనడం విశేషం. ఎస్ఎంఆర్‌వీసీ అధ్యక్షుడు కింగ్ జాన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జీఎం దాసరి సత్యనారాయణ, ఎస్‌బీఐ మేనేజర్ పూజా ఝా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉదయం 11.30కు జాతీయ గీతం సామూహిక గీతాలాపన జరిగింది. సుమారు వందకు పైగా నివాసితులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.