Categories: TOP STORIES

నా ప్రాజెక్టుల్లో పచ్చదనానికే ప్రాధాన్యం

  • మౌలిక వసతులకు, చెట్ల రక్షణకు సమానంగా వెచ్చిస్తాను
  • మొక్కలే నా జీవితం
  • స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం
  • రియల్ ఎస్టేట్ గురుతో నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ శెట్టి

ప్రముఖ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ శెట్టికి క్రెడాయ్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో జరిగిన క్రెడాయ్ నాట్ కాన్‌ 2023 సదస్సులో పాల్గొన్నారు. సునీల్ శెట్టి జీవనయానం ఓ రకంగా ఉంటుంది. హోటల్ మేనేజ్ మెంట్ తో ప్రారంభమైన సునీల్ జీవితం.. 32 లేదా 33 ఏళ్లకు పైగా వ్యాపారరంగంలో బిజీగా ఉన్నారు. దీంతోపాటు సినిమాలు, నిర్మాణం ఇతరత్రా రంగాల్లోనూ ప్రవేశించారు. నాట్ కాన్ సదస్సులో పాల్గొన్న సునీల్ శెట్టి.. రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన గురించి బోలెడు సంగతులు పంచుకున్నారు.

‘నేను ఎందులోనూ నిష్ణాతుడిని కాదు. కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే దాని గురించి మరింత తెలుసుకోవాలని, మరింత నేర్చుకోవాలని అనుకుంటాను. చాలామంది నన్ను ఎంటర్ ప్రెన్యూర్ అని పిలుస్తారు. అయితే, నేను సినిమాలు తప్ప మిగిలిన అన్ని ప్రయత్నాల్లోనూ విఫలమయ్యారు. కానీ సినిమాల తర్వాత రియల్ ఎస్టేట్ వల్లే నాకు విజయం లభించింది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం నేర్పిన నాన్నకు ధన్యవాదాలు. కమర్షియల్ ప్రాపర్టీస్ లో పెట్టుబడి పెట్టడం నాకు లాభించింది. దీంతో ప్రజలు నన్ను వ్యాపారవేత్త అని పిలవడం మొదలుపెట్టారు’ అని ఆయన వివరించారు.

భారతదేశంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి, రియల్ పెట్టుబడుల గురించి సునీల్ శెట్టికి చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన చాలాకాలంగా ఈ రంగంలోనే ఉన్నారు. అత్యాధునిక విల్లాలు, లగ్జరీ ఇళ్లు నిర్మించడంలో ప్రసిద్ధి చెందారు. ‘రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒక అద్భుతం సృష్టించడం అని నేను భావించాను. అందుకే అది నన్ను మరింతగా ఆకర్షించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కళాదర్శకుల్లో ఒకరైన జాతీయ అవార్డు గ్రహీత సాబు సిరిల్ తో పరిచయం అయినప్పుడు నా రియల్ ప్రయాణం ప్రారంభమైంది. రాత్రికి రాత్రే ఆయన ఓ స్టూడియో సృష్టించారు.

అప్పుడు లైటింగ్, టెక్చర్, గ్రీన్ టెక్చర్ల గురించి అర్థం చేసుకున్నాను. నేను కూడా ఇలాంటివి ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించుకున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి ఇంటి ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే తపన నన్ను ఈ దిశగా ప్రోత్సహించింది. కస్టమర్లను కాపాడుకోవడమే విజయవంతమైన వ్యాపారానికి తొలి మెట్టు అని బాగా నమ్ముతాను. స్థిరత్వం, నిబద్ధత అనేవి మనల్ని సమతుల్యంగా ఉంచుతాయి. నిబద్ధతతో క్రమశిక్షణ వస్తుంది. స్థిరత్వం లేకపోత మీరు ఏ పనీ ఎప్పటికీ పూర్తి చేయలేరు. స్థిరత్వం అనేది విజయానికి సంకేతం. మీరు ఏం చేస్తున్నా సంతోషంగా ఉండటం, సంతృప్తి చెందడం కూడా చాలా ముఖ్యం’ అని సునీల్ శెట్టి వివరించారు.

రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖుల నుంచి ప్రేరణ పొందినట్టు ఆయన వెల్లడించారు. ‘నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నా ప్రాజెక్టులతో 100 శాతం ట్రాక్ లోనే ఉంటాను. నా ప్రాజెక్టుల్లో వారు ఎలా నివసిస్తున్నారని మా ఇంటి యజమానులను మీరు తప్పకుండా అడిగి తెలుసుకోండి. నా ప్రాజెక్టులన్నీ పచ్చగా ఉండాలని కోరుకుంటాను. నా ప్రాజెక్టుల్లో మౌలిక వసతుల కోసం ఎంత ఖర్చు చేస్తానో, చెట్లను రక్షించడానికి కూడా అంతే వెచ్చిస్తాను. నేను కావాలనుకుంటు మరో 100 అపార్ట్ మెంట్లను నిర్మించగలను. కానీ అందులో నాది 100 శాతం ప్రమేయం ఉండాలి. లేకుంటే నేను చేయను. స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టమని ప్రస్తుత తరానికి చెప్పండి. వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. సరైన స్టార్టప్ ని కనుక్కోండి. దాని గురించి పరిశోధించండి. అవి చాలా లాభాలను ఇస్తాయి కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టండి’ అని సునీల్ సూచించారు.

‘నేను ఉదయాన్నే 5.30 లేదా 6 గంటలకు నిద్ర లేస్తాను. జిమ్ కి వెళతాను. తర్వాత మా అమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకుంటాను. అనంతరం వారితో అరగంట సరదాగా గడుపుతాను. తర్వాత షూటింగ్ లేదా నా పనుల నిమిత్తం బయటకు వెళతాను. ఇక నాకు తీరిక ఉన్న రోజులలో నా కుటుంబంతో కలసి టెర్రస్ పై ఉన్న మొక్కలతో గడుపుతాను. నా మొక్కలే నా జీవితం. నేను ఏ ప్రాజెక్టు చేసినా, మీకు నచ్చినా నచ్చకున్నా నేనే ల్యాండ్ స్కేపిస్ట్, హార్టీ కల్చరిస్ట్’ అని స్పష్టంచేశారు.

కుటుంబ జీవితాన్ని, వ్యాపార పనులు రెండింటినీ ఎలా సమన్వయం చేసుకుంటారని అడగ్గా.. ‘నేను ఏమి చేయాలనుకుంటున్నానో, ఎంతవరకు కావాలనుకుంటున్నానో నాకు స్పష్టంగా తెలుసు. అలాగే నా కుటుంబం గురించి కచ్చితమైన అవగాహన ఉంది. నేను నిజంగా సంతోషంగా ఉండే జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. క్రమశిక్షణ కలిగి ఉండటం, గొప్ప కుటుంబం, మంచి టీమ్ అనేవి మన ఒత్తిడిని జయించే అంశాలు. బ్యాలెన్సింగ్ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. మన విజన్ ఎంత పెద్దగా ఉన్నా.. దానివైపు వేసే అడుగులు నెమ్మదిగానే ఉండాలి’ అని చెప్పి ముగించారు.

This website uses cookies.