Categories: LATEST UPDATES

హౌసింగ్‌లో భారీగా సంస్థాగత పెట్టుబడులు

హౌసింగ్ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు భారీగా పెరిగాయి. గతేడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో 174 మిలియన్‌ డాలర్లు (రూ.1,444 కోట్లు) పెట్టుబడులు రాగా, ఈ ఏడాది 71 శాతం వృద్ధితో 298 మిలియన్‌ డాలర్లు (రూ.2,473కోట్లు) పెట్టుబడులు రావడం గమనార్హం. భారత రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ మొత్తం మీద సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 679.9 మిలియన్‌ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ నివేదిక వెల్లడించింది.

* క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 374 మిలియన్‌ డాలర్లతో పోల్చి చూసినప్పుడు 82 శాతం వృద్ధి నమోదైంది. రాబోయే త్రైమాసికంలో కూడా పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 71 శాతం దేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి కాగా, విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 27 శాతం పెట్టుబడులు వచ్చాయి.

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అత్యధిక పెట్టుబడులను నివాస ప్రాజెక్టులే దక్కించుకున్నాయి. వీటి వాటా 44 శాతంగా ఉంది. వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల్లోకి 24 శాతం పెట్టుబడులు వెళ్లాయి. ఆఫీస్‌ ఆస్తులు 164 మిలియన్‌ డాలర్లు, ఇండస్ట్రియల్‌ వేర్‌హౌసింగ్‌ ఆస్తులు 190 మిలియన్‌ డాలర్ల చొప్పున సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించాయి.

This website uses cookies.