- ప్లాట్ల పేరు చెప్పి సువర్ణ భూమి డెవలపర్స్ దగా
- సినీ కార్మికుల నుంచి రూ.లక్షల్ల వసూలు
- సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, నలుగురు ఉద్యోగులపై కేసు
హైదరాబాద్ లో మరో రియల్ మోసం వెలుగు చూసింది. ప్లాట్లు ఇస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన సువర్ణ భూమి డెవలపర్స్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 2017లో షాద్ నగర్ సమీపంలో కుటీర్ పేరుతో వెంచర్ వేశామని చెప్పి కృష్ణానగర్ లో నివసించే పలువురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల నుంచి రూ.6 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డబ్బు కట్టించుకున్నారు. అంత మొత్తం ఒకేసారి ఇవ్వలేమని చెప్పడంతో వాయిదాల పద్ధతిలో ఆ డబ్బులు కట్టించుకున్నారు. 2022లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో సంస్థ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా.. వెంచర్ లో ప్లాట్లు లేవని, డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పారు. కానీ 20 శాతం మాత్రమే సొమ్ము వెనక్కి ఇచ్చారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.