కొయంబత్తూరులో గత కొంతకాలంగా ఆగిపోయిన ఓ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు రియల్ ఎస్టేటస్ రెగ్యులేటరీ అథార్టీ (రెరా) కొనుగోలుదారులకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు అవిభాజ్య వాటా లేదా ప్లాట్ల సేల్ డీడ్లను అమలు చేయడానికి రెరా అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రెరా అథార్టీ దీనికి సంబంధించిన అనుమతి కోసం కంట్రీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కి లేఖ రాయనుంది. అనంతరం రెరా వద్ద రిజిస్ట్రేషన్ కోసం అసోసియేషన్ దరఖాస్తు చేసుకుంటుంది. ఆపై కొనుగోలుదారుల బాడీ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుంది.
ఈ మేరకు రెరా తీసుకున్న నిర్ణయం 700 మంది కొనుగోలుదారులకు ఎంతో ఊరట కలిగించింది. సహారా సిటీ హోమ్స్ అనే ప్రాజెక్టును సహారా ప్రైమ్ సిటీ సంస్థ కొయంబత్తూరులో 2005లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇళ్లను 2011 నుంచి అప్పగిస్తామని కొనుగోలుదారులకు స్పష్టంచేసింది. అయితే, ఆ మేరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇందులో పెట్టుబడులు పెట్టినవారంతా సహారా హౌసింగ్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ పేరుతో ఒక బాడీగా ఏర్పడ్డారు. 2019 మార్చిలో సహారా ప్రైమ్ సిటీపై ఫిర్యాదు చేశారు. దీంతో కొనుగోలుదారులకు అనుకూలంగా తమిళనాడు రెరా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.