టీమ్ 4 నుంచి..మూడో ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌!

రెరా జ‌రిమానా విధిస్తుందా? లేదా?

ఆకాశ‌హ‌ర్మ్యాల నిర్మాణంలో పెద్ద‌గా అనుభ‌వం లేని.. టీమ్ 4 సంస్థ ప‌నితీరు భ‌లే విచిత్రంగా ఉంటుంది. ముందు ఎక్క‌డో ఒక చోట స్థ‌లం తీసుకుని.. ప్రీలాంచులో ఫ్లాట్ల‌ను విక్ర‌యించి.. త‌ర్వాత తీరిగ్గా రెరా అనుమ‌తిని తీసుకుని ప్రాజెక్టును ఆరంభిస్తుంది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఈ సంస్థ ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించింద‌ని తెలిసినా ఇంత‌కుముందు టీఎస్ రెరా అథారిటీ పెద్ద‌గా ప‌ట్టించుకునేది. అందుకే, అదే మొండిధైర్యంతో మ‌ణికొండ గుట్ట ప‌క్క‌న మ‌రో ప్రీలాంచ్ ప్రాజెక్టును ప్రారంభించింది. అక్క‌డా అదే స్టోరీ రిపీట్ చేసింది. తాజాగా.. ముచ్చ‌ట‌గా మూడో ప్రాజెక్టును మియాపూర్‌లో మొద‌లెట్టింది. మొద‌ట్లో ప్రీలాంచ్‌లో అమ్మిన నైలా ప్రాజెక్టుకు ఎదురుగా.. అడ్డ‌దిడ్డంగా ఉన్న భూమిలో మ‌ళ్లీ ప్రీలాంచ్ క‌థ‌ను షురూ చేసింది. మ‌రి, ఈసారంటే ప్ర‌భుత్వం టీఎస్ రెరాకు ఛైర్మ‌న్ ను నియ‌మించింది. మ‌రి, ఈసారి టీమ్ 4 ప్రీలాంచ్ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుందో లేదో తెలియాలంటే కొంత‌కాలం వేచి చూస్తే తెలిసిపోతుంది. రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిమానా విధిస్తుందా?

* టీం ఫోర్ లైఫ్ స్పేసెస్ మియాపూర్‌లో ఆరంభించిన స‌రికొత్త ప్రీలాంచ్ ప్రాజెక్టు వ‌ల్ల‌.. అక్క‌డే రెరా అనుమ‌తి పొందిన‌ ప్రాజెక్టులైన వ‌ర్టెక్స్ విరాట్‌, ఆర్‌వీ సాయి వ‌న‌మాలి, క్యాండియ‌ర్ ఫార్టీ, క్యాండియ‌ర్ ట్విన్స్‌, ప్రైమార్క్ ప్రాస్ప‌రా, సియా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అమ్మ‌కాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. ఇలా ఏ సంస్థ అయినా ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తే.. అక్క‌డి స్థానిక సంస్థ‌లు అడ్డుచెప్పాలి. లేక‌పోతే, ఈ తంతు ఇలాగే కొన‌సాగుతుందనే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు.

This website uses cookies.