- తూర్పు నుంచి ఉత్తరానికి ఐటీ నిపుణుల క్యూ
- ఆకర్షణీయమైన రోడ్లు, మౌలిక వసతులతో ఉత్తరానికి పెరుగుతున్న క్రేజ్
ఐటీ నగరం బెంగళూరులో టెకీల చూపు ఉత్తరం వైపు మళ్లుతోంది. తూర్పు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో ఉంటున్న చాలామంది టెకీలు నెమ్మదిగా ఉత్తర బెంగళూరు వైపు వెళ్తున్నారు. ఆకర్షణీయమైన రోడ్లు, పచ్చదనంతోపాటు నీరు నిలిచిపోయే సమస్యలు అంతగా లేకపోవడం వల్ల చాలామంది అక్కడ ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా హెన్నూర్ రోడ్, జక్కూర్, యలహంక, హెబ్బల్ వంటి కీలమైన మైక్రో మార్కెట్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత ఆశాజనకంగా ఉన్నాయని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. వాస్తవానికి కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మైక్రో మార్కెట్లలో ఉత్తర బెంగళూరు ఒకటిగా అవతరించింది.
తూర్పు ఐటీ కారిడార్ కంటే వేగంగా అభివృద్ది చెందడం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యూహాత్మక స్థానం వంటి అంశాలు ఎన్నారైలు, దేశీలయ పెట్టుబడిదారులను బాగా ఆకర్షించాయి. దీంతో తూర్పు బెంగళూరు నుంచి ఉత్తర బెంగళూరు వైపు ఐటీ నిపుణులు క్యూ కడుతున్నారు. అద్దె ఇళ్లు, కొత్త ఇళ్ల కొనుగోలు కోసం ఎంక్వైరీలు బాగా ఊపందుకున్నాయి. కరోనాకు ముందు ఉత్తర బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు మూడో స్థానంలో ఉండగా.. ప్రస్తుతం రెండో స్థానంలోకి వచ్చింది. తొలి స్థానంలో తూర్పు బెంగళూరు ఉంది. ఉత్తర బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 34 నిమిషాల దూరంలో ఉండటం అదనపు అడ్వాంటేజీగా మారింది. 2023 తొలి త్రైమాసికంలో ఉత్తర బెంగలూరులో భూమి ధర చదరపు అడుగుకు రూ.6వేల నుంచి 8వేల మధ్యలో ఉండగా.. అపార్ట్ మెంట్లు చదరపు అడుగుకు రూ.10,850 నుంచి రూ.17,870 మధ్యలో ఉన్నాయి. అలాగే బెంగళూరును హైదరాబాద్, ముంబైతో కలిపే దేవనహళ్లికి సమీపంలో ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారి వ్యాపారాలు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది.
ఈ నేపథ్యంలో ఉత్తరాన కూడా ధరలు పెరుగుతున్నాయి. తనిసండ్ర, హెన్నూరు వంటి ప్రదేశాల్లో ఇప్పటికే 20 శాతం ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఇక 2 బీహెచ్ కే ఇల్లు రూ.27వేలకు దొరుకుతోంది. వైట్ ఫీల్డ్ తో పోలిస్తే దాదాపు 15 శాతం తక్కువ. తూర్పుతో పోలిస్తే.. ఉత్తరాన రియల్ ధరలు ఇప్పటికే 20 నుంచి 30 శాతం పెరగ్గా.. సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుమకూరు, హోసూర్ రోడ్లను కలుపుతూ రాబోయే పెరిఫెరల్ రింగ్ రోడ్ (పీఆర్ఆర్), శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (ఎస్టీఆర్ఆర్), నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్ వంటి అంశాలు రియల్ ఎస్టేట్ ధరలను మరో 10 నుంచి 15 శాతం మేరు పెంచుతాయని చెబుతున్నారు.