Categories: TOP STORIES

తెలంగాణ‌లో కావాలి.. ఇలాంటి లేఅవుట్లు!

  • ఏపీలో ఆరు నగరాల్లో ఎంఐజీ లేఅవుట్లు
  • మధ్యతరగతికి అందుబాటు ధరలో ప్లాట్లు
  • ప్లాట్ల విస్తీర్ణం.. 150, 200, 240 గజాలు
  • ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం కేటాయింపు
  • ధ‌ర‌లో ఇరవై శాతం రిబేటు
  • రాయచోటిలో గజం ధర.. రూ.4600
  • ఏలూరులో గజం.. రూ.8,999
  • మంగళగిరిలో రూ.17,499 గజం

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

ఉత్తమ ప‌థ‌కాలు.. బెస్ట్ ప్రాక్టీసెస్.. దేశ‌, విదేశాల్లో ఎక్క‌డ అమలవుతున్నా వాటిని ఏ రాష్ట్రమైనా అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణ ప్ర‌వేశ‌పెట్టిన‌ రైతుబంధు ప‌థ‌కాన్ని దేశంలోని ప‌లు రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయి. మిష‌న్ భ‌గీర‌థను ఇత‌ర రాష్ట్రాల ప్ర‌తినిధులు వ‌చ్చి ప్ర‌త్య‌క్షంగా చూసి ప్ర‌శంసించారు. ఇలా చెప్పుకుపోతే, తెలంగాణ రాష్ట్రం ప్ర‌వేశ‌పెట్టిన ఉత్త‌మ ప‌థ‌కాల్ని అనేక రాష్ట్రాలు అమ‌ల్లోకి తెస్తున్నాయి. అంతెందుకు, పొరుగున ఉన్న తమిళనాడు మన కళ్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కడ మంచి జరుగుతున్నా.. ఆ ఉత్తమ విధానాల్ని అనుసరించడంలో తప్పు లేదని చెప్పొచ్చు. ఇలాంటి ఓ చక్కటి ప‌థ‌కం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆరు జిల్లాల్లో ఆరంభమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అలా ఆదేశించారో లేదో.. అక్క‌డి పుర‌పాల‌క శాఖ‌, జిల్లా క‌లెక్ట‌ర్లు ఎంతో వాయువేగంతో.. ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో.. అతి త‌క్కువ కాలంలోనే ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ఉప‌యోగ‌ప‌డే ఈ ప‌థ‌కాన్ని నియోజ‌క‌వ‌ర్గానికి ఒక‌టి చొప్పున ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌త్రికా స‌మావేశంలో వెల్ల‌డించారు. ఇంత‌కీ, ఆ ప‌థ‌కాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెడితే మధ్యతరగతి ప్రజలకెంతో ఉపయోగపడుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

స్థ‌లాల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగప‌డే విధంగా.. స‌రికొత్త టౌన్‌షిప్ కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మ‌రి, ఇలాంటి ప‌థ‌కం తెలంగాణ రాష్ట్రంలోనూ ఆరంభ‌మ‌యితే.. కేసీఆర్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకానికి గొప్ప మేలు చేసిన‌ట్లు అవుతుంది. ప్ర‌స్తుతం ఉన్న స్థ‌లాల్ని వేలం వేయ‌కుండా.. ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి.. పార‌ద‌ర్శ‌కంగా విక్ర‌యిస్తే ఉత్తమం. లేదా ఔటర్ రింగ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల అయినా ఇలాంటి లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. గత ఏడేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే దిశగా ఎలాంటి చర్యల్ని పెద్దగా తీసుకున్న దాఖలాల్లేవు. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభమైన రాజీవ్ స్వ‌గృహ‌ ఫ్లాట్లనూ నేటికీ వేలం వేయలేదు. అలాగనీ లేఅవుట్లు వేసి ప్లాట్లనూ విక్రయించలేదు. గత ద‌శాబ్దం నుంచి హైదరాబాద్లోని ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్పుల్ని అభివృద్ధి చేస్తారని వినిపిస్తున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ అది కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈమ‌ధ్య కొన్ని చోట్ల భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ గురించి కొంత హ‌డావిడి కనిపించింది. కాక‌పోతే, ఆత‌ర్వాత అది ముందుకు వెళ్ల‌లేదు. కాబ‌ట్టి, పెరుగుతున్న స్థలాల ధరల నేపథ్యంలో.. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్‌లో లేఅవుట్లను డెవ‌ల‌ప్ చేసి.. మధ్యతరగతి ప్రజలకు విక్ర‌యిస్తే గొప్ప మేలు చేసినట్లు అవుతుంది. అందులో పది శాతం చొప్పున ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు కేటాయిస్తే ఉత్తమం. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరంభ‌మైన ఎంఐజీ ప‌థ‌కం ప్ర‌త్యేక‌త‌లేమిటో ఒక‌సారి చూసేద్దామా..

జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్..

మధ్యతరగతి కుటుంబాలకు (మిడిల్‌ ఇన్‌కం గ్రూపు) సొంత ఇళ్లు ఉండాలన్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. అందుకే వారి కలను సాకారం చేయాల‌ని నిర్ణ‌యించింది. వీరంతా రియ‌ల్ట‌ర్ల బారిన ప‌డి మోస‌పోకూడ‌ద‌ని భావించింది. ఎలాంటి లిటిగేష‌న్ లేకుండా.. క్లియ‌ర్ టైటిల్ గ‌ల ప్లాట్ల‌ను అంద‌జేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో మూడు కేటగిరీలలో స్ధలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎంఐజీ –1 కింద 150 గజాలు, ఎంఐజీ –2 కింద 200 గజాలు, ఎంఐజీ –3 కింద 240 గజాలుగా ప్లాట్ల‌ను విభ‌జించారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైయస్సార్‌ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ లేఅవుట్‌ల‌ను అభివృద్ధి చేస్తారు.

దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ 6 జిల్లాలే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు ప్రతి నియోజవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది. కాబట్టి ప్రతినియోజకవర్గం కేంద్రంలో మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ద‌ర‌ఖాస్తుదారులు, ఆయా నియోజకవర్గాలలో ఉన్నవాళ్లు, ఆ టౌన్స్‌లో ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్ https://migapdtcp.ap.gov.in అందుబాటులోకి తెచ్చారు. ఇందులో అర్హతలకు సంబంధించి 18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవాళ్లంతా జగనన్న స్మార్ట్‌ టౌన్స్‌లో ప్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్లాట్లకు అయ్యే డబ్బులు కూడా నాలుగు వాయిదాల్లో ఒక సంవత్సర కాలంలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. చెల్లింపు పూర్తయిన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారుడి చేతికి అందిస్తారు. ఇలా స్మార్ట్‌ టౌన్స్‌లో ఇంటి స్ధలం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్లాటు నిర్ణీత విలువలో 10 శాతం ముందుగా చెల్లించాలి. అగ్రిమెంటు చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలలు లేదా రిజిస్ట్రేషన్‌ తేదీ లేదా రెండింటిలో ఏది ముందు అయితే ఆ తేదీలోపు మిగ‌తా 30 శాతం సొమ్ము చెల్లిస్తే… రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి వాళ్లకు ప్లాటు అప్పగిస్తారు. ఇలా వాయిదాల్లో కాకుండా ఒకేసారి మొత్తం అమౌంట్‌ ఇచ్చే వాళ్లకు 5 శాతం రాయితీ కూడా ఇస్తారు.

ప్రభుత్వ ఉద్యోగులకూ..

ప్రతి లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ప్రత్యేకంగా కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా ప్లాట్లు కేటాయింపు ఉంటుంది. ఎక్కడా కూడా కులం, మతం, ప్రాంతంతో పాటు ఏ రాజకీయ పార్టీ అని కూడా చూడరు. ఇవేవీ చూసే అవకాశమే లేని విధంగా చాలా పారదర్శకంగా కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఎవరి ప్రమేయం ఇందులో ఉండదు. జగనన్న స్మార్ట్‌ టౌన్స్‌లో పట్టణాభివృద్ధి సంస్ధల ద్వారా పట్టణప్రణాళికా విభాగం నియమ, నిబంధనలకు లోబడి ఏడాదిలో సమగ్ర లే అవుట్లు అభివృద్ధి చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఇతర రియల్‌ ఎస్టేట్‌ వాళ్లకు ఆదర్శప్రాయంగా, మంచి మోడల్‌ లే అవుట్‌గా నిలుస్తుంది.

లే అవుట్‌ ప్రత్యేకతలివే..

ఈ స్మార్ట్‌ టౌన్స్‌లో ప్రభుత్వమే లేఅవుట్లు చేస్తుంది కాబట్టి.. కుటుంబాల అవసరాలను బట్టి 150, 200, 240 గజాల స్ధలాలు ఎంచుకోవ‌చ్చు. పర్యావరణ హితంగా ఉండేలా లేఅవుట్ల విస్తీర్ణంలో 50 శాతం స్ధలం ఆ కాలనీల్లో ఉండే వారి ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూళ్లు, బ్యాంకులు, షాపింగ్‌ రిక్రియేషన్‌ వంటి సదుపాయాల కోసం స్ధలాలు కేటాయిస్తారు. అంతేకాకుండా విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో పుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్‌ ఉంటాయి. ఇవే కాకుండా మంచినీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్ధ, వరదనీటి డ్రైనేజీకి ఈ కాలనీల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. వీధి దీపాలతో పాటు నాణ్యమైన సదుపాయాలుంటాయి. ఎక్కడా, ఎవరూ వేలెత్తి చూపించలేని పరిస్థితిలో అభివృద్ధి చేస్తారు.

కార్పస్‌ ఫండ్‌

ఈ కాలనీల నిర్వహణ కోసం కార్పస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇవాళ మనం అభివృద్ది చేస్తున్న కాలనీలు భవిష్యత్తులో పాడు కాకూడ‌దు. వీటి నిర్వహణ కోసం కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి, ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్‌కు ఆ కార్పస్‌ ఫండ్‌ అప్పగిస్తారు. పట్టణాభివృద్ధి సంస్ధలతో కలిసి వాటిని సంయుక్తంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

ప్లాట్ల ధ‌ర‌లిలా ఉన్నాయి..

ప్రాంతం                    సంఖ్య             ధర (గజానికి)

నవులూరు (మంగళగిరి)          538                       17,499
ధర్మవరం (అనంతపురం)       1,272                    5,999
రాయచోటి (వైఎస్సార్ కడప)    294                      4,600
కావలి (నెల్లూరు)                   1,112                   4,999
కందుకూరు (ప్రకాశం)             292                     6,999
ఏలూరు (ప.గోదావరి)             386                      8,999

This website uses cookies.