Categories: TOP STORIES

తెలంగాణ ప‌ట్ట‌ణాల్లోని ఇళ్లు.. ఠండా ఠండా.. కూల్ కూల్..

  • ఇళ్లలో వేడిని తగ్గించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు
  • తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28 తీసుకొచ్చిన సర్కారు

వేసవి వచ్చేసింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ మొదటివారంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మే వచ్చేసరికి ఎంతటి ఎండలు ఉంటాయో చెప్పక్కర్లేదు. వాతావరణ మార్పుల ప్రభావం కూడా అధిక ఉష్ణోగ్రతలకు ఓ కారణం. పట్టణాల్లో అయితే ఇంకా ఎక్కువ వేడి పరిస్థితులు ఉంటాయి. ఫలితంగా వేడి గాలులు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కావాల్సిందే. దీంతో విద్యుత్ కు తీవ్ర డిమాండ్ ఏర్పడుతుంది. వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాక ముందే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ కనిపిస్తోంది.

రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోంది. తెలంగాణ జనాభాలో దాదాపు 47 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం గతంలో ఎన్నడూ లేనంతగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులను కాస్త నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావాన్ని, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ప్రభావవంతంగా తగ్గించే లక్ష్యంతో తెలంగాణ కూల్ రూఫ్స్ పాలసీ 2023-28 తీసుకొచ్చింది. విపరీతమవైన వేడిని నియంత్రించేందుకు, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్ రూఫ్ పాలసీ అనుసరించాలని సూచించింది. అధిక వేడిని నియంత్రించ‌డానికి సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గం కూల్ రూఫ్ ఒక్కటేనని స్పష్టం చేసింది.

ఏమిటీ కూల్ రూఫ్స్?

రూఫ్ పై భాగంలో సోలార్‌ రిఫ్లెక్టివ్ పెయింట్ వేయడం, తెల్లని టైల్స్ తో రూఫ్ కవర్ చేయడం లేదా వైట్ మెంబ్రేన్ వేయడం ద్వారా తక్కువ ఖర్చుతో కూల్ రూఫ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణ రూఫ్స్ ఉన్న భవనాల కంటే కూల్ రూఫ్స్ ఉన్న భవనాలు సూర్య కిరణాలను తక్కువగా గ్రహిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే వేడిని తిరిగి వాతావరణంలోకి పంపించడంలో కూల్ రూఫ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ రూఫ్స్ సూర్యుడి నుంచి వచ్చే వేడిని మొత్తం గ్రహించి ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి. ఫలితంగా ఏసీలు, కూలర్ల సాయంతో దానిని తగ్గించుకోవాలి. అదే కూల్ రూఫ్స్ ఉన్న భవనాల్లోకి వేడి అంతగా రాదు. మొత్తం ఉష్ణోగ్రతలో సాధారణ రూఫ్స్ కేవలం 20 శాతాన్ని మాత్రమే లోపలకు రాకుండా నిరోధించగలుగుతాయి. కూల్ రూఫ్స్ అయితే, 80 శాతం మేర వేడిని నిరోధిస్తుంది.

ఫలితంగా అంత మేర కూలర్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. కూల్ రూఫ్స్ ఉన్న భవనాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ రూఫ్స్ ఉన్న భవనాల్లో ఉష్ణోగ్రతల కంటే 2.1 డిగ్రీల సెల్సియస్ నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వ్యయపరంగా కూడా ఇవి చాలా అనుకూలమైనవి. ప్రభావవంతమైన పరిష్కారమే కాకుండా డబ్బు ఆదా చేయడం, నగరాలను చల్లగా ఉంచడం వంటి కారణాలతో కూల్ రూఫ్స్ కు అంతర్జాతీయంగా ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూల్ రూఫ్స్ పైలట్ ప్రాజెక్టుల విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ కూల్ రూఫ్స్ పాలసీ 2023-28’ పాలసీ తీసుకొచ్చింది. 2028 నాటికి 300 చదరపు కిలోమీటర్ల పైకప్పు ప్రాంతాలన్ని కూల్ రూఫ్స్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇవీ లక్ష్యాలు..

  • ఇంధనాన్ని ఆదా చేయడం, వేడి నిరోధక చర్యలన మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా కూల్ రూఫ్ పాలసీని వేగంగా అమలు చేయాలి
  • నగర వ్యాప్తంగా కూల్ రూఫ్ విధానాన్ని అమలు చేయడానికి సంస్థాగతంగా విధివిధానాలు రూపొందించాలి
  • కూల్ రూఫ్ లను అమలు చేసేలా అందరినీ చైతన్యవంతం చేయాలి
  • కూల్ రూఫ్ ఏర్పాటుకు సంబంధించి శ్రామికులకు శిక్షణ ఇచ్చే విషయంలో తగిన సహకారం అందించాలి
  • వేటికి కూల్ రూఫ్స్ ఏర్పాటు చేయాలంటే?కూల్ రూఫ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే భవనాలను కేటగిరీలవారీగా విభజించారు.

    ఎ) తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సినవి..

    1. ప్రభుత్వ, నివాసేతర, వాణిజ్య భవనాలు: సైట్ ఏరియా, బిల్టప్ ఏరియాతో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వ సొంత, నివాసేతర, వాణిజ్య భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి.
    2. రెసిడెన్షియల్: 600 చదరపు గజాల కంటే పైబడిన ప్లాట్ ఏరియా కలిగిన అన్ని నివాస భవనాలకూ కూల్ రూఫ్ తప్పనిసరి. 600 చదరపు గజాల లోపు ఇళ్లకు దీనిని ఏర్పాటు చేసే అంశం వారి ఇష్టానికే వదిలిపెట్టారు.
    3. ప్రభుత్వ సాయంతో నిర్మాణమయ్యే అన్ని రకాల ఇళ్లకూ కూల్ రూఫ్స్ తప్పనిసరి.

    బి) ఆప్షనల్

    1. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ కలిగిన భవనాలు కూడా కూల్ రూఫ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.
    2. రాబోయే 3 ఏళ్లలో అన్ని నివాసేతర భవనాలకు తిరిగి అమర్చాలి
    3. 600 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన అన్ని నివాస భవనాలూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
    ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పాలసీ ఐదేళ్లపాటు ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం దీనిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. జీహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ అర్బన్ అగోల్మెరేషనల్ లో హెచ్ఎండీఏ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో డీటీసీపీ నోడల్ ఏజెన్సీలను నియమించి, కూల్ రూఫ్స్ సమర్థంగా అమలయ్యేలా చూస్తాయి. కూల్ రూఫ్ ఏర్పాటుకు సంబంధించి శ్రామికులకు శిక్షణ ఇచ్చే విషయంలో తగిన సహకారం అందించాలి.

This website uses cookies.